ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పటివరకు ఆయన మీద ఆరోపణలు ఉన్నప్పటికీ.. గతానికి భిన్నంగా ఇప్పుడు ఆయన తీవ్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే లైంగిక వేధింపులకు సంబంధించిన కేసును ఎదుర్కొంటున్న ఆయన మీద తాజాగా పోక్సో పిడుగు పడింది.
తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా పేర్కొంటూ ఫిర్యాదు ఇచ్చిన బాధితురాలికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమె మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబయి హోటల్లో తనపై అత్యాచారాం చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. ఇతడిపై పోక్సో సెక్షన్ ను కూడా జత చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్.. నెల్లూరు, పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు.
అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యల్నిముమ్మరం చేశారు. జానీతనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం తెలిసిందే. 2017లో జానీ తనకు పరిచయం అయ్యారని.. 2019లో అతని టీంలో అసిస్టెంట్ డ్యాన్స్ డైరెక్టర్ గా చేరినట్లుగా చెప్పారు. ముంబయిలో ఒక సినిమా షూటింగ్ సమయంలో తాను.. జానీతో పాటుమరో ఇద్దరు అసిస్టెంట్లం వెళ్లామని.. అక్కడ హోటల్ లో తనపై జానీ అత్యాచారం చేశారని పేర్కొన్నారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తామని.. సినిమా పరిశ్రమలో ఎప్పటికి పని చేయలేవని బెదిరింపులకు దిగినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. తాను మౌనంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీన్నో అవకాశంగా తీసుకొన్న జానీ..తనపై హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో షూటింగ్ లకు వెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపించారు.
షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్ లోనూ అసభ్యంగా ప్రవర్తించేవాడన్న ఆమె.. వేధింపులు భరించలేక టీం నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ తనను సొంతంగా పని చేసుకోనివ్వకుండా.. ఇతర ప్రాజెక్టులు తనకు రానివ్వకుండా ఇబ్బంది పెట్టేవాడన్నారు. తొలుత ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ కు కేసును బదిలీ చేశారు. పోక్సో సెక్షన్ ను జత చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.