నిన్న చెన్నైలో జరిగిన దేవర ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ తనకు ఇష్టమైన కోలీవుడ్ డైరెక్టర్ గా వెట్రిమారన్ ని పేర్కొంటూ ఆయనతో ఒక తమిళ సినిమా చేసి తెలుగు డబ్బింగ్ చేయాలనే కోరిక ఉందని స్పష్టం చేశాడు. నిజానికి కొన్నేళ్ల క్రితమే ఈ కాంబో గురించిన వార్త గట్టిగా చక్కర్లు కొట్టింది. అసురన్ తర్వాత ఒక కథ తారక్ కు వినిపించానని, కానీ కార్యరూపం దాల్చలేదని, భవిష్యత్తులో తప్పకుండా జరిగి తీరుతుందనే నమ్మకాన్ని వెట్రిమారన్ వ్యక్తం చేశాడు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
ఇప్పుడదే ఆకాంక్షని తారక్ వెలిబుచ్చడంతో అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. కాకపోతే ఈ కలయిక అంత సులభం కాదు. ఎందుకంటే జూనియర్ ప్రస్తుతం వార్ 2, దేవర 2, ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీస్ కి కమిట్ మెంట్ ఇచ్చాడు. ఎంతలేదన్నా ఇవన్నీ రిలీజయ్యే టైంకి మూడేళ్లు సులభంగా గడిచిపోతాయి. ఇటు వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 తర్వాత సూర్యతో వడివాసల్ ప్లాన్ చేసుకున్నాడు. దీనికి భారీ సమయం, బడ్జెట్ రెండూ కావాలి. ఆ తర్వాత ధనుష్ తో వడ చెన్నై 2 డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇది కూడా తీరుస్తానని కల్ట్ డైరెక్టర్ గతంలో హామీ ఇచ్చారు.
ఈ లెక్కన చూసుకుంటే జూనియర్, వెట్రిమారన్ కలుసుకోవాలంటే ఎక్కువ టైం ఎదురు చూడక తప్పదు. వెనుకబాటుతనం, అణిచివేత, తిరుగుబాటు మీద చాలా సహజంగా తీస్తాడని పేరున్న వెట్రిమారన్ కనక పవర్ హౌస్ లాంటి తారక్ తో కనక ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటే దానికి ఆకాశమే హద్దుగా మారుతుంది. రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఉండకపోయినా తనలో అత్యుత్తమ నటుడిని బయటికి తీసుకురావడానికి జూనియర్ కు ఒక అవకాశం దొరుకుతుంది. కాకపోతే ప్రాక్టికల్ గా పైన చెప్పిన కోణంలో చూస్తే మాత్రం ఇది ఇప్పట్లో నెరవేరే కల మాత్రం కాదు. సమయం పట్టినా నిజమైతే చాలు.