టాలీవుడ్లో మళ్లీ కొంత విరామం తర్వాత ఓ భారీ చిత్రం రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించిన ‘దేవర’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అర్ధరాత్రి 1 గంట నుంచే స్పెషల్ షోలు వేయాలని చిత్ర బృందం చాలా రోజుల ముందే నిర్ణయించుకుంది. తెలంగాణలో ఆల్రెడీ అనుమతులు కూడా వచ్చేశాయి. ఏపీలో కూడా పర్మిషన్లు రావడం లాంఛనమే కావచ్చు.
ఐతే అర్ధరాత్రి షోల కోసం అభిమానుల్లో ఉండే ఆసక్తిని వాడుకుని దోపిడీకి పాల్పడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ షోలను ఒక రేటుకు కొనేసి.. డిమాండును బట్టి అయిన కాడికి టికెట్ల రేట్లు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు రూ.2-3 వేల మధ్య రేట్లు పెట్టేస్తున్నారు. సలార్ లాంటి కొన్ని సినిమాలకు ఇలా బాగా సొమ్ము చేసుకున్నారు. ఇది అభిమానుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
తమ ఆసక్తిని మరీ ఇలా క్యాష్ చేసుకోవడం సబబా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ మూవీకి ఇలా జరక్కుండా చూడాలనుకుంటున్నారట. వేరే వాళ్లకు హక్కులు అమ్మకుండా.. డిస్ట్రిబ్యూటర్లే స్పెషల్ షోల బాధ్యత తీసుకోబోతున్నారట. అఫీషియల్‌గానే ఒక రేటు పెట్టి బయట కాకుండా థియేటర్లలోనే అమ్మకాలు చేయనున్నారట. అభిమానులకు అందుబాటులో ఉండేలా రూ.1000తో టికెట్లు అమ్మే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వేరే వాళ్లకు హక్కులు అమ్మితే వచ్చే ఆదాయం కంటే ఇలా రీజనబుల్ రేటు పెట్టి షో బాధ్యత తీసుకుంటేనే ఎక్కువ లాభం వస్తుందని.. అభిమానులు కూడా సంతోషిస్తారని భావించి.. ‘దేవర’ షోలను ప్రైవేటు వ్యక్తులెవరికి అమ్మకూడదని డిసైడైనట్లు తెలుస్తోంది.
ఇలా రీజనబుల్ రేట్లతో టికెట్లను అందుబాటులోకి తెచ్చి థియేటర్లో లేదా బుక్ మై షో ద్వారా టికెట్లను అమ్మితే.. పద్ధతి ప్రకారం ఈ షోలను నిర్వహిస్తే అందరూ సంతోషంగా ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ షోలపై త్వరలోనే క్లారిటీ రావచ్చు.