పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడున్నా అభిమానులు మాకు ఒకటే ఉందన్న తీరులో ఎక్కడ చూసినా ఓజి జపంతో వేదికలను హోరెత్తిస్తున్నారు. ఇంకా బ్యాలన్స్ ఉన్నప్పటికీ, ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేనప్పటికీ దానికి ఏ స్థాయి ఓపెనింగ్స్ దక్కుతాయో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరించేలా హంగామా చేస్తున్నారు. కానీ దీనికన్నా ముందు హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే సంవత్సరాల తరబడి విలువైన కాలాన్ని, బడ్జెట్ ని ఖర్చు పెట్టారు. దర్శకత్వ బాధ్యతలు క్రిష్ నుంచి జ్యోతికృష్ణకు వచ్చాయి.
ఈ నెలాఖరు లేదా అక్టోబర్ లో పెండింగ్ ఉన్న భాగాన్ని పవన్ కు అనుకూలంగా ఉండే చోట సెట్లు వేసి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విపరీతమైన ఆలస్యం జరగడం వల్ల ఫ్యాన్స్ లో హరిహరవీరమల్లు మీద ఆసక్తి తగ్గిపోయింది. నిజానికి పవర్ స్టార్ కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రంగా దీని మీదే హైప్ నెలకొనాలి. కానీ రివర్స్ జరుగుతోంది. క్రమంగా ఓజి నుంచి అభిమానుల దృష్టి వీరమల్లు మీదకు రావాలంటే ఒక ప్లాన్ ప్రకారం ప్రమోషన్లు మొదలుపెట్టాలి. ఇప్పటిదాకా వచ్చిన టీజర్, పోస్టర్లు ఆ పని చేయలేకపోయాయి. పబ్లిసిటీ నిపుణులను రంగంలోకి దించితేనే పనవుతుంది.
ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించడం లాంటి ఆకర్షణలు హరిహరవీరమల్లులో బోలెడున్నాయి. బాబీ డియోల్ ఔరంగజేబుగా కీలక పాత్ర పోషించాడు. నిధి అగర్వాల్ గ్లామర్ మరో అట్రాక్షన్. అన్నింటిని మించి కళ్ళు చెదిరే సెట్లు, పవన్ చేసే సాహసోపేత విన్యాసాలు చాలానే ఉండబోతున్నాయి. ఇవన్నీ ఆడియన్స్ కన్నా ముందు ఫ్యాన్స్ లోకి తీసుకెళ్లగలిగితే కాసేపు ఓజికి బ్రేక్ ఇచ్చి వీరమల్లు మేనియాకు వస్తారు. ఇలాంటి పీరియాడిక్ డ్రామాలు నార్త్ లోనూ బాగా ఆడుతున్న నేపథ్యంలో హిందీ మార్కెట్ మీద రత్నం ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. 2025 వేసవి రిలీజ్ ఉండొచ్చని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates