ఫ్లాప్ దర్శకుడితో బ్లాక్ బస్టర్ రీమేక్ ?

సక్సెస్ లేని దర్శకుడితో సినిమా అంటే ఎన్నో లెక్కలుంటాయి. ఆడితే ఓకే కానీ తేడా కొడితే మాత్రం విమర్శల పాలు కావాల్సి ఉంటుంది. రమేష్ వర్మ పంతొమ్మిదేళ్ళ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ అంటే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు మాత్రమే. అది కూడా తమిళ ఒరిజినల్ వెర్షన్ కి ఎలాంటి మార్పులు చేయని ట్రూ రీమేక్.

ఎంత మక్కికి మక్కి అయినా మెప్పించేలా తీయడం సులభం కాదు కాబట్టి ఆ విషయంలో ఆయన్ను మెచ్చుకోవచ్చు. దీని తర్వాత రవితేజతో ఖిలాడీ లాంటి పెద్ద ఆఫర్ వచ్చినా అది కాస్తా డిజాస్టర్ కావడం వల్ల మంచి అవకాశం వృథా అయ్యింది.

ఇప్పుడీ రమేష్ వర్మ హీరో లారెన్స్ తో ఒక భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు. కోనేరు నిర్మాణ సంస్థ పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.

తెలుగు డైరెక్టర్లతో చేయడం బాగా తగ్గించేసిన లారెన్స్ దీనికి ఒప్పుకోవడం వెనుక ప్రధాన కారణం ఇది లేటెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కిల్ రీమేక్ కావడం వల్లేనట. తక్కువ ఖర్చుతో ఒక రాత్రి ట్రైన్ లో జరిగే సంఘటనతో రూపొందిన ఈ వయొలెంట్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. హింస ఎంత ఎక్కువున్నా క్లాస్, మాస్ ఆడియన్స్ ఇద్దరినీ మెప్పించడంలో కిల్ విజయవంతమయ్యింది.

ఎవరో చేస్తారని ఎదురు చూస్తుంటే కిల్ ఇలా లారెన్స్ ఖాతాలో పడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. తెలుగు తమిళ భాషల్లో వస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. నిజానికి కిల్ కోసం టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు టయర్ 2 హీరోలు బలంగా ప్రయత్నించారని లీక్ వచ్చింది కానీ ఫైనల్ గా ఇది కోనేరు, రమేష్ వర్మలు దక్కించుకోవడం ట్విస్టు.

ప్రస్తుతం కాంచన 4 పనుల్లో బిజీగా ఉన్న లారెన్స్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేయబోయే స్ట్రెయిట్ మూవీ ఇది. రెండు భాషల్లో సమాంతరంగా తీస్తారా లేక డబ్బింగ్ చేస్తారా అనేది చూడాలి. కిల్ రీమేక్ సంగతిని టీమ్ అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు.