ఇంకో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 కోసం అభిమానులే కాదు సగటు సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 ఏడి, సరిపోదా శనివారం తర్వాత అంతకు మించి అనే స్థాయిలో థియేటర్లను కళకళలాడించే సినిమాగా దీని మీద బయ్యర్ల నమ్మకం అంతా ఇంతా కాదు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్ల కోసం ఎడతెరిపి లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. ముంబైలో ట్రైలర్ లాంచ్ తర్వాత కరణ్ జోహార్, అలియా భట్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, సందీప్ రెడ్డి వంగా తదితరులతో స్పెషల్ ఇంటర్వ్యూలు పూర్తి చేశాడు. మరికొందరు సెలబ్రిటీలతో ఉండబోతున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పుడందరి చూపు దేవర స్పెషల్ షోలు, టికెట్ రేట్ల మీదే ఉంది. అర్ధరాత్రి ఒంట గంట ప్రీమియర్లకు భారీ ఎత్తున ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు పెద్దగా అభ్యంతరం తెలుపకపోవచ్చని టాక్.
అయితే అదనపు షోతో కలిపి గరిష్టంగా అయిదు లేదా ఆరు ఆటలు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే మిడ్ నైట్ షో సెప్టెంబర్ 27 ఖాతాలోకే వస్తుంది. అలాంటప్పుడు రెగ్యులర్ షో టైమింగ్స్ లో మార్పులు అవసరం పడొచ్చు. ఇక టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి కల్కికి ఫాలో అయిన మోడల్ నే దీనికి వర్తింపజేస్తారని అంటున్నారు.
అలా జరిగిన పక్షంలో తెలంగాణ మల్టీప్లెక్సుల్లో గరిష్టంగా ఉన్న 295 రూపాయలకు మరో 75 లేదా 100 రూపాయలు పెంపు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో 75 రూపాయల హైక్ వచ్చే సూచనలున్నాయి. సింగల్ స్క్రీన్లకు ఇప్పుడున్న రేట్ల మీద ఇదే పెంపు ఉంటుంది.
దీనికి సంబంధించిన స్పష్టత ఇంకో రెండు మూడు రోజుల్లో రావొచ్చు. పబ్లిసిటీ పరంగా అతి హడావిడి చేయకుండా కల్కి, సలార్ తరహాలో బజ్ పెంచే భారాన్ని కంటెంట్ మీదే వదిలిస్తున్నారు దర్శక నిర్మాతలు. కనీసం నాలుగైదు రోజుల ముందే రెండు రాష్ట్రాల ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టొచ్చని సమాచారం.