సీక్వెల్స్ అంతగా హిట్ కావనే నెగటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. దానికి తగ్గట్టే మన్మథుడు 2, కిక్ 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటివి దారుణంగా పోయాయి. దీనికి ఎదురీది బ్లాక్ బస్టర్స్ అయినవి లేకపోలేదు. బాహుబలి 2, కెజిఎఫ్ 2, టిల్లు స్క్వేర్ గురించి చెప్పొచ్చు.
అయితే పాజిటివ్ ఫలితాలు వచ్చిన వాటికన్నా నెగటివ్ రిజల్ట్ ఇచ్చినవే ఎక్కువ. అందుకే మత్తు వదలరా 2 మీద అనుమానాలు లేకపోలేదు. పైగా ప్రమోషన్లు బాగానే చేసినా ప్రేక్షకుల్లో భారీ బజ్ కనిపించలేదు. అయితే కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ గా జనం కనెక్ట్ అయిపోతారని మరోసారి ఋజువైపోయింది.
మొదటిరోజు అయిదు కోట్లకు పైగా గ్రాస్ రావడమంటే మాములు విషయం కాదు. ఓవర్సీస్ మూడు లక్షల డాలర్లు దాటేసి అర మిలియన్ వైపు రెండో రోజే పరుగులు పెట్టడం ఈ మధ్య కాలంలో టయర్ 2 హీరోల వల్లే కాలేదు. అలాంటిది మత్తు వదలరా 2 లాంటి కామెడీ మూవీ ఈ ఫీట్ సాధించడం విశేషం.
గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలో 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం మరో సెన్సేషన్. కౌంటర్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయని బిసి సెంటర్స్ రిపోర్ట్. శ్రీసింహ, సత్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఎంటర్ టైనర్ లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఫైనల్ గా కామెడీ వర్కౌట్ అయిపోయింది.
సెప్టెంబర్ 27 దేవర వచ్చే దాకా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడం మత్తు వదలరా 2కి కలిసి వచ్చేలా ఉంది. దీంతో పాటు ఒకేసారి రిలీజైన ఏఆర్ఎం, కళింగ, భలే ఉన్నాడేకు టాక్ ఏమంత పాజిటివ్ లేకపోవడం ప్లస్ అవుతోంది. దీని దెబ్బకు సత్య కామెడీ రేంజ్ మరింత పెరిగింది.
సరైన పాత్ర ఇచ్చి డైలాగులు రాయాలే కానీ ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో మరోసారి ఋజువయ్యింది. లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే సినిమాతో ఫ్లాప్ అందుకున్న దర్శకుడు రితీష్ రానాకు మత్తు వదలరా 2 సక్సెస్ మంచి మెడిసిన్ లా పనిచేస్తోంది. ఏ రేంజ్ సక్సెస్ అనేది ఇంకో వారం వేచి చూడాలి.