నిన్న జరిగిన దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా చివరి నలభై నిమిషాల గురించి చెబుతూ గూస్ బంప్స్ తో థియేటర్లు ఊగిపోతాయనే రేంజ్ లో ఊరించడం అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
వీడియోలో కథ గురించి కొన్ని స్పష్టమైన క్లూస్ ఇచ్చినప్పటికీ ఊహకందని చాలా విషయాలు స్టోరీలో భాగంగా స్క్రీన్ మీద షాక్ ఇస్తాయని అంటున్నారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులను స్పష్టంగా రివీల్ చేయడం ద్వారా దర్శకుడు కొరటాల శివ చాలా పద్దతిగా కంటెంట్ ని చెప్పేశారు. ఇక అసలు ఘట్టం గురించి వద్దాం.
తారక్ అంత స్పెషల్ గా ఊరించాడంటే ఏదో బలమైన ఎపిసోడే ఉండాలిగా. అంతర్గత సమాచారం మేరకు ప్రీ క్లైమాక్స్ తో మొదలయ్యే ఈ సుదీర్ఘమైన ఘట్టంలో పెద్ద దేవరకు సంబంధించిన ఒక టెర్రిఫిక్ ఫైట్ ని హాలీవుడ్ రేంజ్ లో కంపోజ్ చేశారట.
ఊరి జనం కోసం తల ఇవ్వడానికైనా, తీయడానికైనా సిద్ధపడే ఆ పాత్ర అసలు ఉద్దేశం మొత్తం అక్కడే బయట పడుతుందని, ఎలివేషన్లతో పాటు అనిరుద్ రవిచందర్ సంగీతం ఎవరినీ సీట్లలో కుదురుగా ఉండనివ్వదని అంటున్నారు. దేవర కొడుకు పిరికితనం నుంచి తెంపరితనంకు మారే ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఇక్కడే చూపిస్తారని వినికిడి.
నిర్ధారణగా ఇవి నిజమని చెప్పలేం కానీ ఇక్కడ చెప్పిన లీక్స్ చాలా చిన్నవి. అంతకు పదింతలు తెరమీద చూడటం ఖాయం. దర్శకుడు కొరటాల శివ ఇద్దరు దేవర క్యారెక్టరైజేషన్లలో పోలిక లేకుండా జాగ్రత్త పడ్డారని, కొడుకు తండ్రికి మధ్య వ్యత్యాసాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఆయన పనితనం అబ్బురపరుస్తుందని మాట్లాడుతున్నారు.
ఇంకో 16 రోజుల్లో విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 బిజినెస్ ఏరియాల వారీగా పూర్తి చేశారు. థియేటర్ల కేటాయింపు వచ్చే వారం జరుగుతుంది. అర్ధరాత్రి ప్రీమియర్లు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అనుమతులు, అదనపు ఆటలకు సంబంధించిన అప్లికేషన్లు ఆల్రెడీ పెట్టేశారట.