విజయ్ కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. విడుదలకు ముందే సరైన బజ్ తెచ్చుకోని ఈ చిత్రం.. బ్యాడ్ టాక్ కారణంతో తొలి రోజే సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది. చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజైన తమిళ వెర్షన్‌తో కలిపినా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు రూ.3 కోట్ల లోపే.
తొలి రోజు కాబట్టి ఆ మాత్రం వసూళ్లయినా వచ్చాయి. తర్వాతి రోజు నుంచి పరిస్థితి ఘోరంగా తయారైంది. శనివారం వినాయక చవితి, తర్వాతి రోజు ఆదివారం సెలవులను కూడా ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయింది.
‘గోట్’ను తెలుగులో రిలీజ్ చేసిన మైత్రీ సంస్థకు గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ‘గోట్’ మూవీ కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సరిగా ఆడలేదు. ఉత్తరాదిన అయితే ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదు. యుఎస్‌లో తమిళ వెర్షన్ మాత్రమే బాగా ఆడింది. ఇక మిగిలింది తమిళనాడు వసూళ్లు మాత్రమే.
ఐతే తమిళనాట ఉన్న మొత్తం థియేటర్లు వెయ్యి లోపే. అక్కడ ఎంత పెద్ద సినిమా అయినా ఆరేడొందల థియేటర్లలో రిలీజవుతుతందంతే. కాబట్టి తెలుగులో మాదిరి వీకెండ్లో భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉండదు. అయినా సరే.. ‘గోట్’ వసూళ్ల గురించి తమిళ ట్రేడ్ పండిట్లు ఇస్తున్న అప్‌డేట్స్ షాకింగ్‌గా ఉన్నాయి.
తొలి రోజే వంద కోట్లు దాటేసిందన్నారు. ఇప్పుడు ఐదు రోజులకే రూ.300 కోట్ల మార్కును దాటేసినట్లు గొప్పలు పోతున్నారు. విజయ్ బాక్సాఫీస్ స్టామినా గురించి కొనియాడుతున్నారు. కానీ ఈ సినిమాకు వచ్చిన టాక్‌కు, వసూళ్లకు అసలు పొంతన కుదరడం లేదు.
తమిళంలో సినిమా బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుండొచ్చు కానీ.. మరీ ఐదు రోజులకే 300 కోట్లు అన్నది అతిశయోక్తిలాగే అనిపిస్తోంది. వేరే రాష్ట్రాల్లో పేలవంగా ఆడుతూ 300 కోట్ల వసూళ్లు సాధించడం అన్నది అసాధ్యమైన విషయం.
విజయ్ గత కొన్ని సినిమాలకు కూడా ఇలాగే బాక్సాఫీస్ నంబర్స్ హైప్ చేసి చూపించారనే విమర్శలు వచ్చాయి. ‘లియో’ లాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాకు కూడా 400 కోట్ల వసూళ్ల పోస్టర్ దించారు. దీంతో ‘గోట్’ కలెక్షన్ల లెక్కలు కూడా ఫేక్ అనే ప్రచారం జరుగుతోంది.