టాలీవుడ్.. మంచి ఛాన్స్ మిస్సవుతోందా?

టాలీవుడ్‌కు సంబంధించి అతి పెద్ద పండుగ సీజన్ అంటే సంక్రాంతినే. ఆ టైంలో మూణ్నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ చేసేస్తుంటారు. పోటీ తీవ్రంగా ఉంటుంది. థియేటర్ల కోసం గొడవలు జరిగిపోతుంటాయి. ప్రతి ఏడాదీ దీని మీద వివాదం నడుస్తుంటుంది.

కానీ పది రోజుల సెలవులతో అంతే అడ్వాంటేజ్ ఉన్న సీజన్‌ అయిన దసరాను మాత్రం టాలీవుడ్ అంతగా పట్టించుకోవట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లలో ఎప్పుడూ దసరాకు అనుకున్నంత సందడి లేదు. ఈసారి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు.

గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ ‘విశ్వం’, సుహాస్ చిత్రం ‘జనక అయితే గనక’ మాత్రమే ఆ సీజన్లో రిలీజవుతున్నాయి. వీటికి పెద్దగా క్రేజ్ లేదు. ‘విశ్వం’ లో బజ్‌తో రిలీజవుతోంది. ‘జనక..’ మరీ చిన్న సినిమా.

ఇంతకుముందు అయితే సూర్య సినిమా ‘కంగువ’ రిలీజవుతోందని దసరాను మన వాళ్లు లైట్ తీసుకున్నట్లు కనిపించారు. ఆ సినిమాకు తెలుగులోనూ బంపర్ క్రేజ్ ఉంది. కానీ ఆ చిత్రం వాయిదా పడిపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘వేట్టయాన్’ మాత్రమే రిలీజవుతోంది.

దానికి తెలుగులో కొంత బజ్ ఉండొచ్చు కానీ.. మన దగ్గర క్రేజీ సినిమాలేవీ రిలీజ్ చేసుకోలేనంత ఇబ్బందేమీ లేదు. కానీ టాలీవుడ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది. దసరాను ఇలా వదిలేసి అందరూ డిసెంబరు మీద పడిపోయారు.

పుష్ప-2, గేమ్ చేంజర్, తండేల్, రాబిన్ హుడ్, కన్నప్ప.. ఇలా చాలా సినిమాలే డిసెంబరు మీద గురి పెట్టాయి. వీటిలో రెండు సినిమాలను దసరా రేసులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుని ఉంటే వాటికి బాగా అడ్వాంటేజ్ అయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మరోసారి టాలీవుడ్ దసరా కళ తప్పేలా కనిపిస్తోంది.