అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తో సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దీని మీదున్న అంచనాల గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కావడంతో అభిమానులు దేవర పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. దానికి తగ్గట్టే అనిరుధ్ రవిచందర్ పాటలు ప్రేక్షకుల్లో వేగంగా వెళ్లడంతో సెప్టెంబర్ 27 కోసం ఎదురు చూపులు మరింత భారమయ్యాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు ట్రైలర్ మీదే ఉంది. ముంబైలో తారక్, జాన్వీ, సైఫ్ అలీఖాన్ తో పాటు టీమ్ మొత్తం హాజరైన గ్రాండ్ ఈవెంట్ లో అధికారికంగా లాంచ్ చేశారు. కంటెంట్ ఏంటో చెప్పేశారు.
సముద్రపు ఒడ్డున ఉంటూ నీటితల్లి మీద బ్రతికే ఆ ఊరి జనాలకు ధైర్యం తప్ప ఇంకేమి తెలియని మనస్తత్వం. వాళ్ళకు అండగా, నాయకుడిగా ఉంటాడు దేవర (జూనియర్ ఎన్టీఆర్). స్నేహితుడు భైర (సైఫ్ అలీ ఖాన్) అండతో అందరనీ కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు. అయితే ఓ రోజు ప్రమాదం ముంచుకొచ్చి దేవర గూడెంలో భయం మొదలవుతుంది. నెత్తురు ఏరులై పారుతుంది. దీనికి కారణమైన వాళ్ళ అంతు చూసేందుకు వెళ్లిన దేవరకు వయసొచ్చిన కొడుకు (జూనియర్ ఎన్టీఆర్) ఉంటాడు. ఇతనికి పిల్లతనం, పిరికితనం ఎక్కువ. అసలా తీరంలో జరిగిన రక్తపాతం వెనుక ఏం జరిగిందనేది కథ.
దర్శకుడు కొరటాల శివ తీసుకున్న నేపథ్యంలో హింసతో పాటు అంతే మోతాదులో భావోద్వేగాలను జొప్పించినట్టు కనిపిస్తోంది. తండ్రి కొడుకులుగా తారక్ డ్యూయల్ రోల్ చేసిన విషయాన్ని దాచకుండా చెప్పేశారు. విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, సుప్రీత్ ఇలా పెద్ద క్యాస్టింగే ఉంది. దేవరగా జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అంచనాలకు మించి ఉండగా జాన్వీ కపూర్ అల్లరి వినోదానికి ఉపయోగపడుతోంది. అనిరుధ్ రవిచందర్ బీజీఎమ్ లో పనితనం వినిపించింది. దేవరని ఎలా చూడాలని కోరుకుంటున్నారో దానికి తగ్గట్టే ఉన్నాడు కనక హైప్ మరింత పెరగడం ఖాయం.