ఎల్లుండి ఏఆర్ఎం విడుదల కానుంది. మలయాళ డబ్బింగ్ కావడంతో పాటు ప్రమోషన్లకు సరిపడా టైం లేకపోవడంతో ఉన్నంతలో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇటీవలే ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండూ చేశారు. మల్లువుడ్ హీరో టోవినో థామస్ కి ఇక్కడ మార్కెట్ అంతంత మాత్రమే. 2018 ఎవరీ వన్ ఈజ్ ఏ హీరో బాగానే ఆడినా తనకంటూ ఇమేజ్ ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్యాన్ ఇండియా మూవీ ఏఆర్ఎంని మైత్రి మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. విశేషం ఏంటంటే ఇది ఆరేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న సుదీర్ఘమైన ప్రాజెక్టు. వివిధ కారణాల వల్ల లేటయ్యింది.
ఇది టోవినో కన్నా ఎక్కువ కృతి శెట్టికి కీలకం. ఎందుకంటే ఉప్పెనతో పరిచయమై సెన్సేషనల్ డెబ్యూ అందుకున్నప్పుడు వరస అవకాశాలు క్యూ కట్టాయి. నాగచైతన్య, రామ్, నితిన్, సుధీర్ బాబు కోరి మరీ తమపక్కన జోడిగా వేయించుకున్నారు. కట్ చేస్తే అవన్నీ వాళ్ళ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. దెబ్బకు కృతి స్పీడ్ తగ్గిపోయింది. తమిళం వైపు ఫోకస్ పెట్టడం మొదలుపెట్టింది. ఈలోగా ఏఆర్ఎం రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఒకవేళ ఇది కనక విజయం సాధిస్తే మలయాళంలో మంచి ఆఫర్లు దక్కించుకోవచ్చు. పైగా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న సినిమా.
సో ఏఆర్ఎం తాను కోరుకున్న మలుపు ఇస్తుందో లేదో చూడాలి. టోవినో మూడు పాత్రలు పోషించిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ లో డిఫరెంట్ పాయింట్ తీసుకున్నారు. దొంగల వంశంని హైలైట్ చేస్తూ వందల సంవత్సరాల గతం నుంచి వర్తమానం దాకా విభిన్నమైన ప్లాట్ ఎంచుకున్నారు. బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు కానీ గతంలో ఇలాంటివి మన దగ్గర పెద్దగా ఆడని దాఖలాలే ఎక్కువ. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్లు చేసిన ప్రయోగాలు దెబ్బ తిన్నాయి. మరి ఏఆర్ఎం ఈ నెగటివ్ సెంటిమెంట్ ని దాటుకుని టోవినో థామస్, కృతి శెట్టి ఇద్దరికీ బ్రేక్ అందిస్తుందో లేదో చూడాలి.