తెలుగు మార్కెట్ అనుభవిస్తూ కనీసం టైటిల్స్ మార్చకుండా ఇక్కడ వందలాది స్క్రీన్లలో తమ సినిమాలు రిలీజ్ చేసుకునే తమిళ హీరోలు ఏపీ తెలంగాణలో వరదలొచ్చాయనే సంగతే తెలియనంత మౌనంగా ఉండటం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. బలవంతంగా విరాళం ఇవ్వమని ఎవరూ చెప్పరు కానీ కనీస మాననీయ దృక్పథం అవసరం. కానీ కోలీవుడ్ హీరో శింబు ఒక్కడే 6 లక్షలు వరద విపత్తు సహాయక చర్యల కోసం డొనేషన్ గా ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. మన్మథ టైంలో ఉండేది కానీ ప్రస్తుతం శింబుకి టాలీవుడ్ లో మార్కెట్ లేదు. అందుకే డబ్బింగులు రావడం మానేశాయి.
అలాంటిది అతను ఇంత పెద్ద మనసు చేసుకోవడం విశేషమే. అయితే దీని వెనుక మరో ఆసక్తికరమైన కథ ఉందని ఇన్ సైడ్ టాక్. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఓజి కోసం శింబు ఒక పాట పాడాడు. తమన్ స్వరపరిచిన ఆ క్రేజీ సాంగ్ రికార్డింగ్ గతంలోనే పూర్తయ్యింది. మాట్లాడుకున్న టైంలోనే పైసా రెమ్యునరేషన్ వద్దని శింబు ముందే చెప్పాడు. అయినా సరే ఒక నటుడికి ఇవ్వాల్సిన గౌరవార్థం నిర్మాత నుంచి అతనికి చెక్ వెళ్ళింది. పవన్ ఐడియాలజీని బాగా ఇష్టపడే శింబు ఆలస్యం చేయకుండా ఆ మొత్తాన్ని తీసుకోకుండా ఫ్లడ్ డొనేషన్ పేరిట తిరిగి తెలుగు ప్రజలకే ఇచ్చాడు.
ఇది అధికారికంగా బయటికి వచ్చిన టాక్ కాదు కానీ మొత్తానికి ఇదే మ్యాటరని అంతర్గత వర్గాల సమాచారం. అయినా ఇలా చేయడం కూడా గొప్పే. రూపాయి ఇవ్వడానికి పదిసార్లు ఆలోచించే ప్రపంచంలో కోట్లు సంపాదించినంత మాత్రాన అందరూ దాన ధర్మాలు చేస్తారని కాదు. అందులోనూ మనకు సంబంధం లేని పక్క రాష్ట్రం వరద గురించి ఆలోచించడం గొప్ప విషయమే. అందుకే శింబు మీద సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భవిష్యత్తులో శింబు సినిమా ఏదైనా అనువాదం రూపంలో వచ్చి బాగుంటే కనక ఈసారి ఆదరణ దక్కుతుందేమో. అదే తనకు ఇవ్వాల్సిన గౌరవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates