కాన్సెప్ట్ కాపీ.. క్లైమాక్సూ కాపీనే

కొన్నేళ్లుగా త‌మిళంలో నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్నాడు విజ‌య్. త‌నేమీ గొప్ప సినిమాలు చేయ‌క‌పోయినా అనూహ్యంగా పెరిగిన క్రేజీ్, ఫ్యాన్ ఫాలోయిం్ వ‌ల్ల రొటీన్ మాస్ సినిమాల‌తోనే హిట్లు కొడుతూ సాగిపోతున్నాడు. లియో లాంటి పేల‌వ‌మైన సినిమా కూడా హైప్ వ‌ల్ల మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. అంత‌కుముందు విజ‌య్ నుంచి వ‌చ్చిన చాలా సినిమాలు యావ‌రేజ్ కంటెంట్‌తోనే మంచి వ‌సూళ్లు రాబ‌ట్టాయి.

దీంతో విజ‌య్, త‌న ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కాభిమానాన్ని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నార‌నే చ‌ర్చ కూడా మొద‌లైంది. విజ‌య్ కొత్త సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ చూస్తే ఈ అభిప్రాయం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్లే అంతంత‌మాత్రంగా అనిపించాయి. త‌క్కువ అంచ‌నాల‌తో సినిమాకు వెళ్లినా.. గోట్ వాటిని అందుకోలేక‌పోయింది. దీంతో త‌మిళ‌నాడు మిన‌హా అన్ని చోట్లా గోట్ మూవీ తొలి రోజు అనంత‌రం చ‌తికిల‌బ‌డింది. త‌మిళ‌నాట కూడా క‌లెక్ష‌న్లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి.

ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు తీసిన సినిమాల‌కు.. గోట్‌కు అస‌లు పొంత‌నే లేదు. అస‌లీ క‌థ‌లో ఏముంద‌ని విజ‌య్ లాంటి టాప్ స్టార్‌తో చేశాడు అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు ప్రేక్ష‌కులు. ఇందులో ఒరిజిన‌ల్ ఐడియా అంటూ ఏమీ లేదు. హీరో కొడుకే విల‌న్ చేతుల్లో పావుగా మారి త‌న మీద ఎదురు తిరిగే స్టోరీ హాలీవుడ్ మూవీ జెమిని మ్యాన్ నుంచి లేపేసింది. ఈ విష‌యంలో గోట్ ఫ‌స్ట్ పోస్ట‌ర్ రిలీజైన‌పుడే అర్థ‌మైపోయింది. సినిమాలో జెమిని మ్యాన్ పోలిక‌లు చాలా క‌నిపించాయి. ఇంకా కొన్ని సీన్ల‌లో కూడా వేరే సినిమాల ఛాయ‌లు క‌నిపించాయి. ఇక లేటెస్ట్‌గా నెటిజ‌న్లు తేల్చింది ఏమిటంటే.. ఈ సినిమా క్లైమాక్స్ మొత్తం ఓ హాలీవుడ్ మూవీ నుంచి లేపేశార‌ని. ఫైన‌ల్ స్కోర్ అనే హాలీవుడ్ మూవీలో క్లైమాక్స్ ఫుట్ బాల్ స్టేడియం నేప‌థ్యంలో న‌డుస్తుంది.

స్టేడియంలోనే హీరో, విల‌న్స్ మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. స్టాండ్స్ మీదుగా వాళ్లు బైకుల్లో దూసుకెళ్తారు. అక్క‌డ ఫుట్‌బాల్ స్టేడియంలో క్లైమాక్స్ న‌డిస్తే.. గోట్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బ్యాక్ డ్రాప్ తీసుకుని దాదాపుగా అవే సీన్ల‌ను ఇక్క‌డ రిపీట్ చేశాడు వెంక‌ట్ ప్ర‌భు. ఈ పోలిక‌లు చూపిస్తూ గోట్ మూవీని మ‌రోసారి నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.