రానా అభిరుచి….చిన్న కథ కాదు

బడ్జెట్ కన్నా కంటెంట్ మీద దృష్టి పెడితే అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చని గత నెలలో ఒకేసారి ఆయ్, కమిటీ కుర్రోళ్ళు ఋజువు చేశాయి. రవితేజ, రామ్ లాంటి పెద్ద హీరోల పోటీని తట్టుకుని మరీ విజేతగా నిలిచాయి. ఇప్పుడీ కోవలో 35 చిన్న కథ కాదు చేరుతోంది. మొన్న శుక్రవారం రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి మౌత్ టాక్ ఆయుధంగా పని చేస్తోంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో ఆప్ ద్వారా 16 వేలకు పైగా టికెట్లు అడ్వాన్స్ గా అమ్ముడుపోవడం దీనికి సంకేతం. సరిపోదా శనివారం తర్వాత ఎక్కువ టికెట్ సేల్స్ జరిగింది ఈ చిన్న చిత్రానికే అంటే ఆశ్చర్యమే.

నిర్మాత దగ్గుబాటి రానా అభిరుచి దీని ద్వారా మరోసారి బయటపడింది. ఇదిప్పుడు మొదలైంది కాదు. 2018లో కేరాఫ్ కంచరపాలెంతోనే తన టేస్ట్ ఏంటో ప్రపంచానికి చాటాడు. జీరో అంచనాలతో వచ్చిన ఆ మూవీ థియేటర్ వసూళ్లు రాబట్టడానికి కారణం రానా దాన్ని జనంలోకి తీసుకెళ్లిన విధానమే. ఆ తర్వాత కృష్ణ అండ్ హిజ్ లీల నేరుగా ఓటిటిలో వచ్చినప్పటికీ భారీ స్పందన దక్కించుకుంది. కన్నడ డబ్బింగ్ 777 ఛార్లీకి తన బ్రాండ్ చాలా ఉపయోగపడింది. విరాటపర్వం తెరకెక్కడంలో సురేష్ బాబు కన్నా రానా స్వయం నిర్ణయమే ఎక్కువ. వసూళ్లు రాకపోయినా ప్రశంసలు దక్కాయి.

తర్వాత కీడా కోలా పర్వాలేదనిపించుకోగా పరేషాన్ కొన్ని కేంద్రాల్లో బాగానే రాబట్టింది. ఇప్పుడు 35 చిన్న కథ కాదు కోరుకున్న ఫలితాన్ని ఇచ్చింది. నివేదా థామస్ ని ఇలా కొత్తగా చూపించవచ్చన్న దర్శకుడు నందకిషోర్ ఆలోచన ఫ్యామిలీ ఆడియన్స్ ని దగ్గరికి తీసుకొస్తోంది. రివ్యూలు, పబ్లిక్ టాక్ అన్నీ సానుకూలంగా రావడం పబ్లిసిటీ పరంగా చాలా హెల్ప్ అవుతోంది. పిల్లలు, వాళ్ళ తల్లి తండ్రులకు సంబంధించిన ఒక మంచి ఎమోషన్ ని హ్యాండిల్ చేసిన విధానం నవ్వులతో పాటు చక్కని భావోద్వేగాలను పంచుతోంది. అందుకే కంచరపాలెం తర్వాత రానాకిది ఎక్కువ సంతృప్తినిస్తోంది.