గుంటూరు కారం టైంలో అంచనాలు అందుకోలేదని అభిమానులు ఆడిపోసుకున్నారు కానీ నిజానికి ఇప్పటికీ కుర్చీ మడతపెట్టినే 2024లో టాప్ ఛార్ట్ బస్టరంటే కొందరు నమ్మరేమో. ఈ ఒక్క వీడియో సాంగే 400 మిలియన్ల వ్యూస్ దాటేసి ఇంకా దూసుకుపోతూనే ఉంది.
దాని తర్వాత గేమ్ ఛేంజర్ నుంచి జరగండి జరగండి తప్ప తన నుంచి ఎలాంటి రిలీజ్ లేకుండా పోయింది. ఇప్పుడు అయిదు నెలల సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత తమన్ కు మళ్ళీ సౌండ్ చేసే అవకాశం వచ్చేసింది. డిసెంబర్ 20 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ నుంచి రెండో ఆడియో సింగల్ అతి త్వరలో వినిపించేందుకు రెడీ అవుతోంది.
చేతిలో ఉన్న ఉన్న మూడున్నర నెలలు ప్రమోషన్ పరంగా చాలా కీలకం కావడంతో తమన్ మీద చాలా పని ఉండబోతోంది. ఒక పక్క ఫైనల్ కాపీ సిద్ధం చేసేందుకు దర్శకుడు శంకర్ బయట కనిపించకుండా, మీడియాకు దొరక్కుండా కష్టపడుతున్నారు.
చరణ్ కాకుండా ఇతర ఆర్టిస్టులతో ఉన్న చిన్న ప్యాచ్ వర్క్ ని వేరే టీమ్ తో కానిస్తున్నారు. ఇండియన్ 2 విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈసారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనిరుద్ రవిచందర్ ని వాడుకోలేదనే కామెంట్స్ మళ్ళీ రాకూడదంటే తమన్ నుంచి బెస్ట్ రాబట్టుకోవాల్సిందే.
అసలే శంకర్ ను గురువుగా భావించే తమన్ దానికి రామ్ చరణ్ తోడవ్వడంతో కెరీర్ బెస్ట్ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు జరగండి జరగండి పాట విషయంలో రేగిన అసంతృప్తి పూర్తిగా తొలగిపోవాలంటే రెండో సాంగ్ అంతకు మించి అనిపించేలా ఉండాలి.
ఇదయ్యాక ఓజి హడావిడి మొదలవుతుంది. ఇదీ తమన్ కంపోజింగే. డిసెంబర్ లోనే రాబోతున్న పుష్ప 2 ది రూల్ హడావిడి కూడా త్వరలోనే మొదలవుతున్న నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ ల మధ్య అభిమానులు పోలిక పర్వానికి తెరలేపుతారు. సో మ్యూజిక్ లవర్స్ కి మంచి కనువిందైన అప్డేట్స్ రాబోయే నెలల్లో విందు భోజనం పెట్టనున్నాయి.