ఇది మన ‘తారే జమీన్ పర్’

మలయాళంలోనో, తమిళంలోనో, ఇంకేదో భాషలో మంచి సినిమా వచ్చిందంటే.. మన దగ్గర ఇలాంటి సినిమాలు రావేంటని మన ప్రేక్షకులు నిరాశ పడుతుంటారు. కానీ నిజంగా మన దగ్గర మంచి సినిమాలొస్తే ఆదరించి ప్రోత్సహిస్తామా అన్నది ప్రశ్న.

‘మంచి’ సినిమా అంటే అదేదో బూతు అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎంత ఎక్కువగా చెడు చూపిస్తే అంత బాగా వసూళ్లు వస్తాయనే అభిప్రాయం బలపడిపోయింది ఈ మధ్య టాలీవుడ్లో. హీరోల పాత్రలను కూడా విలన్ల తరహాలో తయారు చేస్తూ ఎక్కువగా చెడునే చూపిస్తున్నారు కథల్లో.

ఇలాంటి సమయంలో కూడా అప్పుడప్పుడూ మంచి సందేశంతో కూడిన మంచి సినిమాలు వస్తుంటాయి. ఆ కోవలోని చిత్రమే.. 35: ఇది చిన్న కథ కాదు. గణితం అంటే అర్థం కాని ఓ కుర్రాడి బాధను ఇటు టీచర్లు, అటు తల్లిదండ్రులు అర్థం చేసుకోక అతణ్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టడం.. చివరికి లెక్కల పరీక్షలో పాస్ మార్కులు తెచ్చుకోవడం తనకు జీవన్మరణ సమస్యగా మారడం.. ఈ పరిస్థితుల్లో అతనెలా ఆ పరీక్ష పాసయ్యాడు అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది.

కథగా చూసుకుంటే చాలా చిన్న పాయింట్. కానీ ఈ పాయింట్ పట్టుకుని చాలా పెద్ద పాఠమే బోధించాడు కొత్త దర్శకుడు నందకిషోర్ ఏమాని. పిల్లల పెంపకం ఎలా ఉండాలి.. వాళ్లకు పాఠాలు ఎలా బోధించాలి.. వాళ్ల మనసు తెలుసుకుని ఏం చెప్పినా వాళ్లు ఎలా ఆకళింపు చేసుకుని అనుకున్నది సాధిస్తారు.. ఇలాంటి విషయాలను వినోదాత్మకంగా, అలాగే ఉద్వేగభరితంగా చెప్పాడు నందకిషోర్. నరేషన్ కొంచెం స్లో అన్న కంప్లైంట్ తప్పితే ఈ సినిమాలో ఎంచదగ్గ లోపాలేమీ కనిపించవు.

నివేథా థామస్ అద్భుత అభినయంతో సినిమాను నిలబెట్టింది. కథకు కీలకమైన పాత్రలో నటించిన చిన్న పిల్లాడు కూడా చాలా బాగా చేశాడు. మంచి సంగీతం, విజువల్స్ కూడా తోడవడంతో ‘35’ ప్రత్యేకమైన సినిమాగా నిలబడింది.

అరంగేట్రంలోనే ఇలాంటి కథను చెప్పాలన్న దర్శకుడి ప్రయత్నం.. అతడికి అండగా నిలిచిన నిర్మాతల అభిరుచి అభినందనీయం. హిందీలో ఆమిర్ ఖాన్ తీసిన ‘తారే జమీన్ పర్’ చూసి భాషా భేదం లేకుండా అందరు ప్రేక్షకులూ కదిలిపోయారు. మన వరకు ‘35’ కూడా ‘తారే జమీన్ పర్’ లాంటి సినిమానే. మంచి కథ, కథనంతో అలరిస్తూనే ఆలోచింపజేసే ఇలాంటి సినిమాకు పట్టం కట్టడం ప్రేక్షకుల బాధ్యత.