హఠాత్తుగా ఊడిపడ్డ డిజిటల్ ఇస్మార్ట్

ఒకపక్క ఉత్తరాది మల్టీప్లెక్సులేమో థియేటర్, ఓటిటి మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉంటే తప్ప స్క్రీన్లు ఇవ్వమనే కండీషన్ ని ఖరాఖండీగా పాటిస్తున్నాయి. ఇంకోపక్క దక్షిణాదిలో చూస్తేనేమో మూడు నాలుగు వారాలు తిరగడం ఆలస్యం పెద్ద సినిమాలు సైతం డిజిటల్ లో వచ్చేస్తున్నాయి. ఇటీవలే విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సరిగ్గా 21 రోజులకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ జరుపుకుంటోంది. నిజానికి ముందస్తు ప్రకటన ఇవ్వలేదు. సదరు ఓటిటి సాధారణంగా పాటించే ప్రమోషనల్ స్ట్రాటజీ వాడలేదు. హఠాత్తుగా ఊడిపడినట్టు ప్రైమ్ లో పెట్టేయడంతో తెల్లవారాక చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు.

2024 అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన డబుల్ ఇస్మార్ట్ దర్శకుడు పూరి జగన్నాధ్ కు కంబ్యాక్ మూవీ అవుతుందనుకుంటే మొన్నటి ఏడాది లైగర్ గాయాన్ని మరింత పెద్దది చేసింది. సుమారు నలభై కోట్ల దాకా నష్టాన్ని మిగిల్చిందని ట్రేడ్ టాక్ ఉంది. దీన్ని పూడ్చే క్రమంలో కొంత పారితోషికాలు వెనక్కు ఇస్తారనే టాక్ ఉన్నప్పటికీ అదెంత వరకు నిజమో ఖరారుగా తెలియదు. పట్టుమని ఎక్కడా వారం రోజులు చెప్పుకోదగ్గ రన్ దక్కని డబుల్ ఇస్మార్ట్ కు మూడు వారాల గడువు ఎక్కువే అయినప్పటికీ ఓటిటి విండో గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతున్న సమయంలోనే ఇలా జరగడం ట్విస్ట్.

ఇలాంటి సినిమాల ఎర్లీ స్ట్రీమింగ్ వల్ల ఇండస్ట్రీకొచ్చిన నష్టమేమి లేదు కానీ అంతో ఇంతో నిర్మాతకు ఆదాయం రూపంలో మేలు జరుగుతుంది. రామ్ ఎనర్జీ, సంజయ్ దత్ విలనీ, కావ్య థాపర్ గ్లామర్, మణిశర్మ సంగీతం, అలీ కామెడీ ట్రాక్ ఒకదాన్ని మించి మరొకటి ఇన్ని ఆకర్షణలను చేతులారా వృథా చేసుకున్న పూరి జగన్నాధ్ కెరీర్ లో డబుల్ ఇస్మార్ట్ మరో పాఠంగా నిలిచిపోతుంది. ఒకవేళ హిట్టయ్యుంటే ఎలా ఉండేదో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికొచ్చే ఫీడ్ బ్యాక్, ట్రోలింగ్ ఊహించుకుని ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ కొచ్చిన ముప్పు అలాంటిది మరి.