లియో ఎక్కడ.. గోట్ ఎక్కడ?

గత దశాబ్ద కాలంలో నెమ్మదిగా తెలుగులో మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. ఒకప్పుడు తన సినిమాలు తెలుగులో రిలీజవ్వడమే గగనం అన్నట్లుండేది పరిస్థితి. కానీ గత కొన్నేళ్లలో తన క్రేజ్, మార్కెట్ పెరుగుతూ వచ్చాయి. ‘లియో’ సినిమాకు అవి పీక్స్‌కు చేరాయి.

‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం కూడా ప్లస్ అయి ‘లియో’కు ఎక్కడ లేని హైప్ వచ్చింది. విడుదలకు రెండు రోజుల ముందే చాలా షోలు అడ్వాన్స్ ఫుల్స్ అయిపోయాయి. పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నడూ లేని విధంగా విజయ్ సినిమాకు అర్లీ మార్నింగ్ షోలు కూడా పడ్డాయి ఆ చిత్రానికి. అవన్నీ కూడా కూడా అడ్వాన్స్ ఫుల్సే. విజయ్‌కి తెలుగులో ఇంత క్రేజేంటి అని అందరూ షాకైపోయిన పరిస్థితి.

‘లియో’ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చినా సరే.. ప్రి రిలీజ్ హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల సినిమా సూపర్ హిట్ రేంజిని అందుకుంది. భారీ ఓపెనింగ్స్‌తో వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కానీ ఇప్పుడు విజయ్ కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’కు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. నిన్ననే ‘గోట్’కు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

బోలెడన్ని థియేటర్లు, షోలు ఇచ్చారు కానీ.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. టికెట్ల అమ్మకాలు మొదలై సగం రోజు గడిచినినా బుక్ మై షోలో ఎటు చూసినా గ్రీన్ కలరే కనిపిస్తోంది. ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు పెద్దగా కనిపించడం లేదు. ఇక సోల్డ్ ఔట్ పరిస్థితి అసలే లేదు. ‘గోట్’ విషయంలో ఎందుకో మేకర్స్ ముందు నుంచి ప్రమోషన్ల పరంగా హడావుడి చేయట్లేదు. ట్రైలర్ కూడా ఓ మోస్తరుగా అనిపించిందంతే. ఐతే కంటెంట్ మీద టీం చాలా నమ్మకంతో ఉంది. ప్రస్తుతానికైతే తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్‌ ఆశాజనకంగా లేవు. ‘లియో’తో దీనికసలు పోలికే లేదు. సినిమాకు టాక్ బాగుంటే కథ మారుతుందేమో చూడాలి.