థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు తీయడంలో బాలీవుడ్ దర్శకుల నైపుణ్యమే వేరు. ఓటీటీలు ఊపందుకున్నాక వాటిలో ఎక్కువ విజయవంతం అయినవి బాలీవుడ్ డైరెక్టర్లు తీసిన సిరీస్‌లే. ఈ కోవలోనే నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన కొత్త సిరీస్.. ‘ఐసీ 814: ది ఖాందహార్ హైజాక్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, అరవింద్ స్వామి, దియా మీర్జా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఆద్యంతం గ్రిప్పింగ్‌గా ఉండి ప్రేక్షకులకు ఉత్కంఠ పంచుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సిరీస్‌ల్లో ఇదొకటిగా విమర్శలు ప్రశంసిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో ఇది ఇండియా వరకు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ సిరీస్ ఒక్క విషయంలో మాత్రం విమర్శల పాలవుతోంది.
ఖాందహార్ హైజాక్‌లో భాగమైంది ఎవరు అన్నది అందరికీ తెలుసు. ఇస్లామిక్ ఉగ్రవాదులే నాడు ఈ హైజాక్‌కు పాల్పడ్డారు. అందులో నిందితుల పేర్లు కూడా అప్పుడే బయటికి వచ్చాయి. ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్.. ఇవీ ఖాందహార్ హైజాక్ నిందితుల అసలు పేర్లు. వీళ్లందరూ ముస్లింలే అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. కానీ ఈ సిరీస్‌లో మాత్రం వాళ్ల పేర్లను మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్.. అంటూ వేరు పేర్లతో సంబోధించారు. పనిగట్టుకుని ఇలా ముస్లింల పేర్లను మార్చి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఎంత వరకు సబబు అనే ప్రశ్న ఎదురవుతోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎప్పుడూ ఇలాగే చేస్తుంటారన్నది విమర్శ. తమిళంలో ఆ మధ్య వచ్చిన ‘జై భీమ్’ సినిమాలో కూడా బాధితుడి పట్ల హింసాత్మకంగా ప్రవర్తించిన పోలీస్ అధికారి క్రిస్టియన్ అయితే.. సినిమాలో మాత్రం హిందువుగా చూపించారు. దాని పట్ల విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఉగ్రవాదులు ముస్లింలు అయితే.. ఆ విషయం కప్పిపుచ్చేలా ఈ సిరీస్ తీయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.