మగ వంశపు ఆణిముత్యాల ‘స్వాగ్’ సందడి

విలక్షణమైన ట్రెండీ కథలను ఎంచుకునే శ్రీవిష్ణు ఈసారి స్వాగ్ అనే వెరైటీ సినిమాతో వస్తున్నాడు. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఒకవైపు నవ్విస్తూనే ఇంకోవైపు ఇదెలా సాధ్యం అనిపించేలా ట్రై చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. రాజ రాజ చోర లాంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన హసిత్ గోలితో మరోసారి చేతులు కలిపి అంతకు మించిన ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ వినోదాత్మక చిత్రం టీజర్ ఇవాళ లాంచ్ చేశారు. రెండు నిమిషాల వీడియోలో ఆసక్తికరమైన విషయాలు బోలెడున్నాయి.

శతాబ్దాల క్రితం మగాడి ఉనికే లేకుండా చేయాలనే శ్వాగణిక సామ్రాజ్యానికి మహారాణి (రీతూ వర్మ) చెప్పు చేతల్లో, రాజ్యం మొత్తం ఆమె అదుపాజ్ఞల్లో ఉంటుంది. వంశం నిలవాలంటే మగాడి తోడు అవసరం కాబట్టి దానికి వేరే మార్గం చూస్తున్న క్రమంలో ఓ వీరుడు (శ్రీవిష్ణు) ఎలాగైనా ఈ అరాచకాన్ని అడ్డుకోవాలని చూస్తుంటాడు. అయితే గతం నుంచి వర్తమానం దాకా అచ్చం అతని పోలికల్లోనే ఉండే మరో ముగ్గురు భూమి మీదే ఉంటారు. ఆ రాణి సైతం మహిళాభ్యుదయ వాదిగా పునర్జన్మ ఎత్తుతుంది. అసలు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్న సింగ, భవభూతి, యయాతి, రాజా భవభూతి  వెనుక కథే స్వాగ్.

దర్శకుడు హసిత్ గోలి ఈసారి చాలా క్రియేటివ్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. స్టోరీ అర్థం కాకుండా తెలివిగా టీజర్ కట్ చేసిన విధానం ఆసక్తి రేపుతోంది. వివేక్ సాగర్ సంగీతం, శంకరన్ ఛాయాగ్రహణం టాప్ క్వాలిటీలో కనిపిస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత రీతూ వర్మకు మంచి పెరఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ ఈసారి విశ్వరూపం చూపించేలా ఉంది. ముఖ్యంగా వీరప్పన్ మీసాలతో ఒక గెటప్, పళ్ళు ముందుకొచ్చిన వృద్ధుడిగా మరో వేషం దేనికవే విచిత్రంగా ఉన్నాయి. మొత్తానికి టీజర్ తో ఆకట్టుకోవడంలో స్వాగ్ సక్సెస్ అయ్యింది. ఇదే స్థాయిలో కంటెంట్ ఉంటే బొమ్మ హిట్టే.