ఒకప్పుడు టాలీవుడ్లో బిజీయెస్ట్ యంగ్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు నారా రోహిత్. తన సినిమాలు తొమ్మిది ఒకే సమయంలో వివిధ దశల్లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి నటుడు నాలుగైదేళ్ల పాటు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు.
ఇక తన కెరీర్ ముగిసిందని అనుకుంటున్న సమయంలో ‘ప్రతినిధి-2’ ద్వారా ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ‘సుందరకాండ’ అనే కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు నారా రోహిత్. ఈ సినిమా టీజర్ సోమవారమే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మీడియాను కలిసిన రోహిత్ తన కెరీర్లో గ్యాప్ రావడానికి కారణమేంటో వివరించాడు. ‘‘2017, 2018లో నేను చేసిన సినిమాలు చూసుకుంటే నాకే నచ్చలేదు.
ఆ టైంలో కమర్షియల్‌గా ప్రయత్నిద్దామని ప్రయత్నించి ఫెయిలయ్యాను. ఐతే నా సినిమాలు అందరికీ నచ్చడానికి నేనేమీ దేవుడిని కాదు. మామూలు వ్యక్తిని. జీవితం మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు. అందుకే తర్వాత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది’’ అని రోహిత్ తెలిపాడు.
‘ప్రతినిధి-2’ ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపిందా అని రోహిత్‌ను అడిగితే.. తనకా విషయం తెలియదని. దానికి, ఎన్నికలకు సంబంధం లేదని చెప్పాడు. ప్రజలకు అన్నీ తెలుసని.. సినిమాల ద్వారా ప్రభావితం అవుతారని తాను అనుకోనని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ప్రతినిధి-3 చేస్తారా అని అడిగితే.. ప్రతినిధి-2 ఫలితం చూసే ఈ మాట అడుగుతున్నారా అని ప్రశ్నించడం ద్వారా ఆ సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఈ ఫ్రాంఛైజీలో ఇంకో సినిమా ఉండదని చెప్పకనే చెప్పేశాడు రోహిత్.
భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పదవి చేపడతారా అని రోహిత్‌ను ప్రశ్నిస్తే.. దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేనని, అన్నింటికీ కాలమే సమాధానం ఇస్తుందని వేదాంత ధోరణిలో సమాధానమిచ్చాడు రోహిత్. పెళ్లి కాన్సెప్ట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చని.. కానీ వాటికంటే ‘సుందరకాండ’ భిన్నంగా ఉంటుందని, ఈ కథలో హీరోకు జరిగినట్లు నిజ జీవితంలో జరిగితే గుండె ఆగిపోతుందని.. కానీ సినిమాలో అది వినోదాత్మకంగా ఉంటుందని రోహిత్ తెలిపాడు.