ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే హీరోలు, దర్శకులకే కాదు అభిమానులకూ హాట్ ఫేవరెట్. ఆయన మ్యూజిక్ వల్లే స్థాయి పెరిగి వంద రోజులు ఆడిన సినిమాలు ఎన్నో. ఆడియో క్యాసెట్ కంపెనీలు కోట్లలో లాభం కళ్లజూసేందుకు, థియేటర్లలో డీటీఎస్ సౌండ్ సిస్టంలకు సార్థకత చేకూరేందుకు ఆయన సంగీతం పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. కొన్నేళ్ల క్రితమే ఫామ్ తగ్గిపోయి తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళు దూసుకొస్తుండటంతో క్రమంగా నెమ్మదయ్యారు. కానీ ఇస్మార్ట్ శంకర్ తిరిగి మణిశర్మని రేసులో నిలబెట్టింది. దానికిచ్చిన పాటలు పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చాయి.
కానీ దాని తర్వాతే ఎన్ని ఆఫర్లు వచ్చినా మణిశర్మ మార్కు కనిపించకపోవడం అసలు ట్రాజెడీ. ఆచార్య, శాకుంతలం, శ్రీదేవి సోడా సెంటర్, సీటిమార్, రిపబ్లిక్, నారప్ప, రెడ్ ఇవన్నీ స్టార్లతో నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రాలు. హిట్టా ఫ్లాపా పక్కనపెడితే ఒకటి రెండు తప్ప అన్ని సాంగ్స్ బాగున్న ఆల్బమ్ ఏదీ లేదు. బెదురులంక 2012, భళా తందనాన, అలా ఇలా ఎలా, మిస్టర్ కింగ్, జిలేబి లాంటి చిన్న చిత్రాలకు పని చేసినా ఫలితంలో మార్పు రాలేదు. తాజాగా డబుల్ ఇస్మార్ట్ కూడా డిజాస్టర్ బాట పట్టింది. ట్యూన్స్ రిపీట్ అనిపించాయి తప్పించి మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్థాయిలో లేవు.
ఒకదశ దాటాక క్రియేటివిటీ తగ్గడం సహజమే కానీ మణిశర్మ మరీ రిటైర్మెంట్ స్టేజిలో లేరు. తనకన్నా సీనియరైన ఏఆర్ రెహమాన్ చేతిలో కమల్ హాసన్, రామ్ చరణ్ లాంటి స్టార్ల సినిమాలున్నాయి. యువన్ శంకర్ రాజా, హరీష్ జైరాజ్ అప్పుడప్పుడు తమ ముద్రని చూపించగలుగుతున్నారు కానీ మణిశర్మ మాత్రం వెనుకబడుతున్నారు. కొడుకు మహతి స్వరసాగర్ సైతం తండ్రి లెగసిని కనీస స్థాయిలో అందుకోలేకపోయాడు. భోళా శంకర్ ఎంత ఘోరంగా ఉన్నా కనీసం పాటలు బాగున్నా నాలుగైదు అవకాశాలు వచ్చేవి. అదీ జరగలేదు. మెలోడీ బ్రహ్మ మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు