చాలా రోజుల తర్వాత నిన్న థియేటర్లు సందడి సందడిగా కనిపించాయి. కొత్త రిలీజులతో హాళ్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకుని క్యాంటిన్ నుంచి పార్కింగ్ స్టాండ్ దాకా సిబ్బంది మొత్తం బిజీగా కనిపించారు. టాక్స్ సంగతి పక్కనపెడితే పేరున్న పెద్ద హీరోల సినిమాలే ఎక్కువ కావడంతో మొదటి రోజు చూసేద్దామన్న ప్లాన్ తో టికెట్లు కొన్న వాళ్లే ఎక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం భారీ సంఖ్యలో రావడం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే స్పష్టమయ్యింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ మూడూ ఒకే తరహా స్పందన దక్కించుకున్నప్పటికీ ఓపెనింగ్స్ బాగున్న వైనం వసూళ్లలో తేటతెల్లమయ్యింది.
ఊహించిన విధంగా నార్త్ లోనే అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ బాలీవుడ్ మూవీ స్త్రీ 2కి రెస్పాన్స్ బాగుంది. ప్రీమియర్ల ప్లాన్ వర్కౌట్ కాగా హిందీ ప్రేక్షకులు దీనివైపే మొగ్గు చూపారు. ఇక చిన్న చిత్రం ఆయ్ కు బాగుందనే టాక్ ఇవాళ్టి నుంచి ఉపయోగపడాలి. నిన్న పోటీ వల్ల పెద్ద నెంబర్లు కనిపించలేదు కానీ ఈ రోజు నుంచి గణనీయంగా మార్పు ఉంటుందని బయ్యర్ల అంచనా. గత వారం విడుదలైన కమిటీ కుర్రోళ్ళకు ఈ వారం కూడా జోరు కొనసాగేలా ఉంది. బుక్ మై షో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. కల్కి 50 రోజులు పూర్తి కావడంతో థియేట్రికల్ రన్ కు పూర్తి సెలవు ఇచ్చేసింది.
ఇప్పుడీ కొత్త జోరు ఎన్ని రోజులు ఉంటుందనేది కీలకం. వచ్చే వారం చెప్పుకోదగ్గ విడుదలలు లేవు. రావు రమేష్ మారుతినగర్ సుబ్రహ్మణ్యంతో పాటు మరో రెండు చిన్న సినిమాలు అనౌన్స్ చేశారు కానీ ప్రమోషన్ తాలూకు సందడి కనిపించడం లేదు. ఇంద్ర రీ రిలీజ్ మీద మెగా ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. ఆగస్ట్ 29 నాని సరిపోదా శనివారం వచ్చేదాకా ఇండిపెండెన్స్ డే సినిమాలకు ఢోకా లేదు. రెండు వారాల సమయముంది. కాకపోతే టాక్ ని తట్టుకుని రవితేజ, రామ్, విక్రమ్ లు ఏ మేరకు నెగ్గుకు వస్తారో చూడాలి. ఏదైతేనేం బాక్సాఫీస్ కు జోష్ అయితే వచ్చేసింది.