పెద్ద హీరోల సినిమాల కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు కొన్ని వారాల గ్యాప్ తర్వాత ఆ కోరిక తీర్చేందుకు వచ్చిన మొదటి వాళ్ళలో మిస్టర్ బచ్చన్ ఫస్ట్. కంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజు సాయంత్రమే భారీ ఎత్తున ప్రీమియర్లకు సిద్ధ పడిన మాస్ మహారాజా బృందం ప్రమోషన్లతో గట్టి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ ట్రాక్ రికార్డుతో పాటు ఈసారి భాగ్యశ్రీ బోర్సే కొత్త గ్లామర్ బజ్ పెరగడానికి ఉపయోగపడింది. మరి బచ్చన్ నిజంగా అంత మేజిక్ చేశాడో లేదో చూద్దాం పదండి.
కథ
తొంభైల నాటి కాలం. నిజాయితీకి మారుపేరైన ఆదాయపు పన్ను అధికారి బచ్చన్ (రవితేజ). ఒక బిగ్ షాట్ నల్లడబ్బుని పట్టుకోవడంతో సస్పెండ్ అయితే ఇంటికి తిరిగొచ్చేసి తనకిష్టమైన స్టేజి సింగర్ గా పాటలు పాడుతూ గుడిలో చూసిన జిక్కి (భాగ్యశ్రీ బోర్సే)ని ప్రేమించి పెళ్లి దాకా తెచ్చుకుంటాడు. ఈలోగా ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి అతని సస్పెన్షన్ ఎత్తేస్తూ ఆర్డర్స్ వస్తాయి. వెంటనే అక్రమాలను అడ్రెస్ గా మార్చుకున్న ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) ఇంటి మీదకు రైడ్ కు వెళ్ళమని ఆదేశాలు అందుకుంటాడు. టీమ్ తో సహా అక్కడికి వెళ్లిన బచ్చన్ కు ప్రమాదం స్వాగతం పలుకుతుంది. దీన్నుంచి అతనెలా బయటపడ్డాడు, జిక్కిని ఎలా దక్కించుకున్నాడనేది స్టోరీ.
విశ్లేషణ
రీమేక్ చేయడం ఒక కళ. యధాతథంగా తీయడం సులభమని వినడానికి బాగుంటుంది కానీ అదెంత క్లిష్టమైన ప్రక్రియో ఫెయిల్యూర్స్ ని చూసినప్పుడు అర్థమవుతుంది. ఇది బాగా తెలిసిన వాడు కావడం వల్లే దర్శకుడు హరీష్ శంకర్ బాలీవుడ్ మూవీ దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా నమ్మకశక్యం కానీ రీతిలో మార్చి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఆరేళ్ళ క్రితం వచ్చిన రైడ్ ని తెలుగు ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతో దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చే సాహసం చేశాడు. అజయ్ దేవగన్, ఇలియానా జంటగా వచ్చిన ఆ చిత్రం సీరియస్ గా సింగల్ టోన్ లో సాగుతుంది. అవసరం లేని డైవర్షన్లు ఉండవు. అందుకే కల్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
కానీ రైడ్ ని మక్కికి మక్కి రవితేజ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ తో తీస్తే బిజినెస్ పరంగా చాలా రిస్క్. అందుకే కమర్షియల్ హంగులు అవసరం పడ్డాయి. కానీ అవి ఎంత మోతాదులో ఉండాలనే దాని మీద అంత అనుభవమున్న హరీష్ శంకర్ సైతం అయోమయానికి గురవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బచ్చన్ క్యారెక్టరైజేషన్ ని రెగ్యులర్ ఫార్మాట్ లో మొదలుపెట్టినా తన మార్కు డైలాగులతో కొంతవరకు బాగానే లాకొచ్చిన దర్శకుడు హీరోయిన్ తో లవ్ ట్రాక్ దగ్గరి నుంచి మరీ రొటీన్ గా నడిపించడం దగ్గరి నుంచే ట్రైన్ క్రమంగా పట్టాలు తప్పడం మొదలయ్యింది. ఎన్నోసార్లు చూసేసిన తరహాలో బచ్చన్, జిక్కిల ప్రేమకథ సాగడం మొదటి సగంలో ప్రధాన లోటు.
హిందీ సినిమా సంగీతం పట్ల విపరీతమైన ప్రేమ ఉన్న హరీష్ శంకర్ దాన్ని పదే పదే ప్రదర్శించడం ఒకదశ దాటాక బోర్ కొట్టించేసింది. రవితేజ, సచిన్ కెడ్కర్, భాగ్యశ్రీ ఇలా అందరూ బాలీవుడ్ మ్యూజిక్ అంటే పడి చచ్చిపోయే రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేసి పదే పదే హిందీ పాటలను ప్లే చేయించడం సగటు తెలుగు ఆడియన్స్ కి మింగుడు పడని వ్యవహారమే. అక్కడక్కడా చిరంజీవి, ఏఎన్ఆర్ సాంగ్స్ వాడినప్పటికీ వాటి వల్ల కలిగిన ప్రయోజనం తక్కువ. రైడ్ లో లేని లవ్ స్టోరీని ఇక్కడ గంటకు పైగా అదనంగా ఎందుకు జోడించారో అర్థం కాదు. దాని బదులు బచ్చన్ తన వృత్తిలో చేసిన రిస్కులు, వాటి తాలూకు అడ్వెంచర్లను రాసుకుని ఉంటే బాగుండేదేమో.
ఇంటర్వెల్ దాకా ఇలా టైం పాస్ చేయిస్తూ వచ్చిన బచ్చన్ సెకండాఫ్ లో ముత్యం జగ్గయ్య మీద రైడింగ్ కు వచ్చాక గంటంపావు నిడివిలో ఒకే ఇంట్లో నడిపించే బరువైన బాధ్యత హరీష్ శంకర్ మీద పడింది. ముందే చెప్పినట్టు ఒరిజినల్ ని ఫాలో అయితే ఇక్కడి మాస్ కి ఎక్కకపోవచ్చు. అందుకే రవితేజ, జగపతిబాబుల మధ్య మైండ్ గేమ్ తో పాటు చమ్మక్ చంద్ర కామెడీ, అన్నపూర్ణమ్మ ఓల్డ్ ఏజ్ ఫ్లాష్ బ్యాక్ లాంటి స్పెషల్ ప్లాట్లు ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నారు. కానీ ఒకటి రెండు తప్ప ఇవేవి పేలలేదు. ఎలివేషన్ దక్కాల్సిన చోట ఏదో బీజీఎమ్ వల్ల కొంత ఊపనిపిస్తుంది కానీ సన్నివేశాల పరంగా ఎలాంటి ప్రత్యేకంగా లేక అతి మాములుగా గడిచిపోతాయి.
దీంతో రజనీకాంత్ జైలర్ తరహాలో సిద్ధూ జొన్నలగడ్డ క్యామియోని పెట్టిన హరీష్ శంకర్ దాన్ని బాగానే డీల్ చేసినప్పటికీ అప్పటికే డామినేట్ అవుతున్న బలహీనతలను టిల్లు బాయ్ ఒక్కడే కాపాడలేకపోయాడు. అవుట్ డోర్ ఆవసరం లేని కథనంలో బలవంతంగా కొన్ని టాక్స్ తీసుకొచ్చినా వాటిని ప్రతిభావంతంగా రాసుకోలేకపోవడంతో తేలిపోయాయి. ఏదో పాటల కోసమే బచ్చన్, జిక్కిలను కలపడమే తప్ప వాళ్ళ ప్రేమ తాలూకు ఎమోషన్ మనకు ఎక్కడా కనెక్ట్ కాదు. పోటాపోటీగా ఇద్దరూ డాన్స్ చేసిన ఊర మాస్ పాటలు కొంతమేర నిలబెట్టాయి కానీ సినిమా బాగుందని చెప్పడానికి అవి ఎంత మాత్రం సరిపోలేదు. రైడ్ అసలు ఉద్దేశం అది కాదు కదా.
క్యాస్టింగ్ ఎంపిక కొంత మిస్ మ్యాచ్ అవ్వడం ఇంపాక్ట్ తగ్గించేసింది. రవితేజ అక్కయ్య ఒక సీన్లోనే కనిపించినా ఆర్టిస్ట్ సెలక్షన్ బ్యాడయ్యింది. జగపతిబాబు కొడుకుగా చమ్మక్ చంద్ర ఏ మాత్రం నప్పలేదు. హాస్యం కోసమే అయినా ఇంకా మెరుగైన ఛాయస్ చూడాల్సింది. మాస్ పల్స్ పట్టుకోవడమంటే హీరోయిన్ నడుము, పాటలు, ఫైట్లు మాత్రమే కాదనే సూత్రం ఎన్నోసార్లు ఋజువైనా వాటికే కట్టుబడి మిస్టర్ బచ్చన్ ని హరీష్ శంకర్ ఇలా తీయడం ఆశ్చర్యపరుస్తుంది. మరీ బాలేదనో దారుణంగా ఉందనో చెప్పడం కాదు కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఎలా ఉందనే ప్రశ్న వేసుకుంటే కొంచమైనా బాగుందనే సమాధానం మాత్రం రప్పించలేకపోయారు.
నటీనటులు
రవితేజ ఎనర్జీ గురించి ఎన్నిసార్లు రాసినా తక్కువే. బచ్చన్ గా తనవరకు చెడుగుడు ఆడేశాడు. టైమింగ్ బాగా కుదిరింది. డాన్సుల్లో ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తుంది. భాగ్యశ్రీ బోర్సే అందం అభినయం రెండూ పాస్. స్వంత డబ్బింగ్ చెప్పకపోయి ఉంటే బాగుండేది. జగపతిబాబు అరుపుల్లో సౌండ్ ఎక్కువయ్యింది. సౌరభ్ శుక్లాని మరిపించలేకపోయారు. కమెడియన్ సత్య చిన్న చిన్న జోకులతో అక్కడక్కడా బాగానే నవ్వించాడు. సిద్దు జొన్నలగడ్డ సర్ప్రైజ్ బాగుంది. ఉన్న కాసిన్ని నిమిషాలు రిలీఫ్ ఇచ్చాడు. చమ్మక్ చంద్ర, ప్రభాస్ శీనుల ఎపిసోడ్ సింకవ్వలేదు. అన్నపూర్ణమ్మ, నారాయణరావు, భరణి, సచిన్ కెడ్కర్, గౌతమి తదితరులంతా ఓకే.
సాంకేతిక వర్గం
మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. కొన్ని ఎలివేషన్లకు మంచి స్కోర్ ఇచ్చారు. ఆడియో పరంగా రెండు పాటలు మాస్ కు ఆల్రెడీ రీచ్ అయ్యాయి. తెరమీద అంతే హుషారుతో సాగిపోయాయి. రెప్పల్ డప్పుల్, నల్లంచు తెల్లచీర రెండూ పైసా వసూల్ సాంగ్సే. ఆయనంక బోస్ ఛాయాగ్రహణంలో రవితేజ, భాగ్యశ్రీలు పోటీపడి అందంగా కనిపించారు. విజువల్స్ ని ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ పదునుగా ఉండాల్సింది. రెండు గంటల నలభై నిముషాలు డిమాండ్ చేసే లెన్త్ కాదిది. అయిదుగురు స్క్రీన్ ప్లే రైటర్లు ఇవ్వాల్సిన అవుట్ ఫుట్ ఇది కాదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ఎప్పటిలాగే రాజీ లేకుండా సాగాయి
ప్లస్ పాయింట్స్
రవితేజ ఎనర్జీ
భాగ్యశ్రీ గ్లామర్
రెండు పాటలు
మైనస్ పాయింట్స్
ప్రేమకథ
రొటీన్ ట్రీట్మెంట్
కమర్షియల్ మోతాదు
సింకవ్వని కామెడీ
ఫినిషింగ్ టచ్ : పేలని బాంబు
రేటింగ్ : 2 / 5
This post was last modified on August 16, 2024 11:38 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…