గురువారం విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. వారియర్, స్కంద గాయాలను పూర్తిగా మర్చిపోయే రేంజ్ లో బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకంతో ట్రేడ్ సైతం భారీ పెట్టుబడి పెట్టింది. థియేట్రికల్ డీల్స్ విషయంలో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు అన్నింటిని సెటిల్ చేశారు. ఇదిలా ఉండగా విలన్ గా నటించిన సంజయ్ దత్ ప్రమోషన్లకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం చూస్తున్నాం. అందుకే టీమ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూని రామ్, పూరి,ఛార్మీ, కావ్య థాపర్ లతో కలిసి సంజయ్ దత్ నుంచి ప్రత్యేక విశేషాలను రాబట్టింది.
క్లైమాక్స్ గురించి సంజు బాబా ఎగ్జైట్ అవుతూ చెప్పడం ఆసక్తి రేపింది. వీర శివభక్తుడైన తనకు చివరి ఘట్టంలో ప్రతిష్టించిన శివ లింగం చూసి నోట మాట రాలేదని, అనిర్వచనీయమైన అనుభూతిని పొందానని చెబుతూ, గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో పులకించి పోయానని ఆనందం పంచుకున్నాడు. ఫైట్లలో ఆయుధాలు వాడటం వగైరాలున్నా ఇది మాత్రం తనకు చిరకాలం గుర్తుండిపోతుందని అన్నాడు. ట్రైలర్ లో దీనికి సంబంధించిన షాట్స్ కొన్ని చూపించిన సంగతి తెలిసిందే. వందలాది సమూహం మధ్య రామ్, సంజయ్ దత్ పరస్పరం ఘర్షణ పడే యాక్షన్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ లోనూ ఇలాంటి ట్రాక్ ఉన్నప్పటికీ అంతకు మించి అనే స్థాయిలో దీన్ని డిజైన్ చేశారట. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయిన డబుల్ ఇస్మార్ట్ ఓపెనింగ్స్ భారీగా వస్తాయనే ధీమా బయ్యర్లలో ఉండగా పోటీ తీవ్రంగా ఉండటం ఆసక్తి రేపుతోంది. మిస్టర్ బచ్చన్, తంగలాన్, ఆయ్ లతో స్థానికంగా కాంపిటేషన్ ఉండగా హిందీలో శ్రద్ధ కపూర్ స్త్రీ 2 సవాల్ విసురుతోంది. అయితే అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహం వేదాల కన్నా డబుల్ ఇస్మార్ట్ కే బాలీవుడ్ ఆడియన్స్ లో క్రేజ్ ఉండటం సానుకూలాంశం. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం మెయిన్ అట్రాక్షన్.