నిన్న బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల తాకిడి ఎక్కువగా ఉంది. ఎన్ని వచ్చినా అంతో ఇంతో జనాల దృష్టిలో ఉన్నవి కమిటీ కుర్రోళ్ళు ఒకటైతే రెండోది సింబా. అనసూయ ప్రధాన పాత్ర పోషించగా జగపతిబాబు లాంటి సీనియర్ స్టార్లు ఉండటం వల్ల ప్రమోషన్ గట్రా బాగానే చేశారు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సింబా ద్వారా మురళీమనోహర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాగా రచ్చ, సీటిమార్, గౌతమ్ నందా లాంటి కమర్షియల్ చిత్రాలు అందించిన సంపత్ నంది స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చడం విశేషం. కంటెంట్, టాక్ ఈ రెండింటి మీదే ఆధారపడ్డ సింబా ఎలా ఉందో చూసేద్దాం.
స్కూల్ టీచర్ అక్షిక (అనసూయ) కాళ్ళులేని భర్తను కంటికి రెప్పలా చూసుకుంటూ కుటుంబాన్ని గుట్టుగా నడిపిస్తూ ఉంటుంది. ఓ రోజు అనూహ్యంగా ఒక వ్యక్తిని చూసి వెంటపడి మరీ దారుణంగా చంపేస్తుంది. ఈ కేసు గురించి తవ్వుతున్న జర్నలిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్ మాగంటి ) విచిత్రంగా ఆమెతో కల్సి మరో మర్డర్ చేస్తాడు. ఈ బృందంలో మరో డాక్టర్ (అవినాష్ కురువిల్లా) కూడా చేరి మూడో హత్యలో భాగమవుతాడు. కేసుని పోలీసులు విచారించే క్రమంలో అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ఈ నేరాలకు నేచర్ లవర్ పురుషోత్తంరెడ్డి (జగపతిబాబు) నేపథ్యం ఉంటుంది. అదేంటో చూపించేదే అసలు కథ.
బయోలాజికల్ మెమరీ అనే పాయింట్ ని తీసుకుని రివెంజ్ డ్రామాని జోడించిన మురళీధర్ దానికి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేని సమకూర్చుకోవడంలో తడబడ్డాడు. అతనొక్కడే స్టయిల్ లో క్రైమ్స్ మొదలుపెట్టి దానికో ఆసక్తికరమైన సెటప్ పెట్టుకున్నప్పటికీ ఎంగేజ్ చేయని ఇన్వెస్టిగేషన్ తో ఒకదశ దాటాక సాగదీసిన ప్రహసనంగా మారిపోయింది. దానికి తోడు పర్యావరణం మీద బలమైన మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అవసరానికి మించి ల్యాగ్ ని పెట్టేశారు. అనసూయ, జగపతిబాబు శాయశక్తులా నిలబెట్టే ప్రయత్నం చేశారు కానీ విపరీతమైన ఓపిక, సమయం ఉంటేనే సింబాని ట్రై చేయొచ్చు
Gulte Telugu Telugu Political and Movie News Updates