గేమ్ ఛేంజర్ విడుదల క్రిస్మస్ కి ఖరారు కావడంతో మెగాభిమానులు డిసెంబర్ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. వచ్చే నెల నుంచి ప్రమోషన్లకు శ్రీకారం చుట్టే సూచనలున్నాయి. ఈ క్రమంలో కొన్ని లీక్స్ ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తున్నాయి. అందులో ప్రధానమైంది రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ చేయడం. ఇప్పటిదాకా మెగా పవర్ స్టార్ ద్విపాత్రాభినయం చేశాడు కానీ జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ లాగా మూడు క్యారెక్టర్స్ లో కనిపించలేదు. సో గేమ్ ఛేంజర్ కు సంబంధించి ఇది ఎగ్జైట్ మెంట్ ఇచ్చే అంశమవుతుంది. కానీ ఈ టాక్ నిజం కాదు. కహాని వేరే ఉంది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో మూడు షేడ్స్ లో కనిపించే వాస్తవమే కానీ పాత్రలు మాత్రం రెండే. మొదటిది అప్పన్నగా స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిగా పూర్తి వైట్ అండ్ వైట్ లో కనిపిస్తాడు. అంజలి భార్యగా నటించింది ఈ ఎపిసోడ్ లోనే. ఈయన కొడుకే రామ్ నందన్. కాలేజీ చదువుకి సంబంధించి కొంత భాగం ఉంటుంది. అక్కడే కియారా అద్వానీతో లవ్ ట్రాక్, ఆపై ఐఎఎస్ కు ప్రిపేరై విజయం సాధించడం ఒక దశ. ఇక్కడ చరణ్ కాస్ట్యూమ్స్, డాన్సులు ట్రెండీగా ఉంటాయి. కలెక్టర్ గా మారిన తర్వాత చరణ్ పూర్తిగా క్లీన్ షేవ్ లుక్ తో, పక్కా ప్రొఫెషనల్ గా మారతాడు. ఇదంతా సెకండాఫ్ లో ఉంటుంది.
ఇది చరణ్ మూడు షేడ్స్ వెనుక ఉన్న కథ. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో జయరాం, సునీల్, ఎస్జె సూర్య లాంటి క్రేజీ క్యాస్టింగ్ భారీగా ఉంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కావడంతో దిల్ రాజు భారీ ఎత్తున థియేటర్లను లాక్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. అదే సమయంలో అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ తో పాటు హాలీవుడ్ మూవీ ముఫాసా లయన్ కింగ్ బరిలో ఉండటంతో ఓవర్సీస్ లో స్క్రీన్లను సెట్ చేసుకోవడం పెద్ద సవాల్. దానికి ఇప్పటి నుంచే కసరత్తు జరగాలి. నవంబర్ మూడో వారం నుంచి భారీ ఎత్తున పబ్లిసిటీ క్యాంపైన్లు చేస్తారట.