ఇప్పటి స్టార్ గాయకులు సంవత్సరమంతా కలిపితే ఒక 50 పాటలు పాడితే ఎక్కువేమో. ఆ లెక్కన చూస్తే పదేళ్లకు 500 పాటలు అవుతాయి. 50 ఏళ్ల పాటు ఒకే ఫాంలో పాటలు పాడినా గరిష్టంగా 5 వేల పాటలు పాడగలరు. మరి ఒక గాయకుడు 40 వేల పాటలు పాడటం అంటే మాటలా? అందులోనూ ఆ గాయకుడు పీక్స్‌లో ఉన్నది అటు ఇటుగా పాతికేళ్లు. అంటే ఏడాదికి సగటున 15 వేల పాటలకు పైగానే పాడేశారు కొన్నేళ్ల పాటు. అంటే ఏడాదిలో వెయ్యికి తక్కువ పాటలు పాడలేదన్నట్లు. రోజుకు సగటున మూణ్నాలుగు పాటలు పాడేసినట్లు. మరి అవేమైనా మామూలు పాటలా? ప్రతి పాటా ఓ అద్భుతమే. ఒక పాట రికార్డ్ చేయడానికి ఇప్పటి గాయకులు. రోజులు వారాలు తీసుకుంటుంటే.. బాలు ఒక్క రోజులో పది పాటలు టాప్ క్వాలిటీతో రికార్డ్ చేసి పడేసిన రోజులున్నాయి. ప్రపంచంలో ఇలాంటి గాయకుడు ఇంకొకరు ఉంటారా?
దాదాపు మూడు దశాబ్దాల పాటు పగలూ రాత్రి తేడా లేకుండా శ్రమించిన గాన యోధుడు బాలు. 70, 80, 90 దశకాల్లో ఆయన ఊపు మామూలుగా లేదు. 2000 తర్వాత కానీ ఆయన జోరు తగ్గించలేదు. ఒక ఆడియో ఆల్బంలో అన్ని పాటలూ ఒకే సింగర్‌తో పాడించే సంప్రదాయం పోయి.. 90ల్లో రెహమాన్ లాంటి వాళ్లు ఒక్కో సింగర్‌తో ఒక్కో పాట పాడించే ఆనవాయితీ వచ్చాక బాలు హవా తగ్గింది. నెమ్మదిగా ఆయన పాడటం తగ్గించేశారు. గత కొన్నేళ్లలో ఎప్పుడో కానీ ఒక పాట పాడట్లేదు బాలు. తెలుగు విషయానికి వస్తే ఆయన చివరగా తన గాత్రాన్ని వినిపించిన సినిమా ‘పలాస 1978’. అందులో ‘ఓ సొగసరి..’ అంటూ సాగే పాట పాడారు బాలు. ఐతే ఈ సినిమా విడుదలలో ఆలస్యం జరిగింది కానీ.. ఈ పాట కొంచెం ముందే రికార్డయింది. చివరగా తెలుగులో బాలు పాడిన సినిమా పాట అంటే.. ‘డిస్కో రాజా’లోని ‘నువ్వు నాతో ఏమన్నావో..’ అంటూ సాగే పాటే. ఈ సినిమాలో రవితేజ ఫ్లాష్ బ్యాక్ 80వ దశకం నేపథ్యంలో సాగుతుంది. ఆ టైంలో వచ్చే వింటేజ్ స్టైల్ సాంగ్‌కు బాలు మాత్రమే న్యాయం చేయగలరని ఆయనతో పాడించాడు తమన్. ఆ పాటను తనదైన శైలిలో హుషారుగా, తన పాత పాటలను గుర్తుకు తెచ్చేలా పాడి అభిమానుల్ని అలరించారు బాలు.