మారుతి బృందం మీదే రాజ్ తరుణ్ ఆశలు

యూత్ హీరో రాజ్ తరుణ్ టైం అస్సలు బాలేదు. ఒకవైపు లావణ్య కేసు వ్యవహారం రోజు రోజుకి ముదిరిపోతోంది. ఎవరికి వారు తమ దగ్గర ఆధారాలు బలంగా ఉన్నాయని బల్లగుద్ది వాదిస్తుండటంతో ఏది నిజమో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. చివరికి క్లైమాక్స్ ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు కానీ మొత్తానికి ఈ పంచాయితీ చాలా దూరం వెళ్లేలా ఉంది. దీని సంగతి కాసేపు పక్కనపెడితే సినిమాల పరంగానూ రాజ్ తరుణ్ కు వరస్ట్ పీరియడ్ నడుస్తోంది. కేవలం వారం రోజుల గ్యాప్ లో రిలీజైన పురుషోత్తముడు, తిరగబడరా సామీ ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్ అనిపించుకోవడం పెద్ద దెబ్బే.

నిజంగా అవి బాగుంటే వివాదాలను పట్టించుకోకుండా జనం థియేటర్లకు వచ్చేవాళ్ళు. కానీ రొటీన్ కంటెంట్ ఎంచుకున్న దర్శకులు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ చేతిలో మరో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రముంది. భలే ఉన్నాడే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకు నిర్మాతల్లో స్టార్ డైరెక్టర్ మారుతీ ఒకరు. ఆయన టీమ్ పేరు మీదే ప్రెజెంట్స్ అని టైటిల్స్ లో వేస్తున్నారు. మూడు నెలల క్రితమే టీజర్ వచ్చింది కానీ రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు. ఇప్పుడు మారుతీ బృందం చేయబోయే పబ్లిసిటీ భలే ఉన్నాడేకి రీచ్ తేవాల్సిన బాధ్యత తీసుకోవాలి. వినూత్నంగా ప్లాన్ చేయాలి.

కాన్సెప్ట్ పరంగా చూస్తే భలే ఉన్నాడే ఏదో వెరైటీగానే అనిపిస్తుంది. కానీ బజ్ రావాలంటే ఇంకొంచెం గ్యాప్ తీసుకోవడం అవసరం. ట్రేడ్ లో సోలో హీరోగా రాజ్ తరుణ్ మార్కెట్ బాగా డ్యామేజ్ అయ్యింది. ప్రభాస్ ది రాజా సాబ్ దర్శకుడిగా మారుతీ బృందమే భలే ఉన్నాడేకి మైలేజ్ వచ్చేలా చేయాలి. ఈ ఏడాది ప్రారంభంలో నా సామిరంగా హిట్ అయినప్పటికీ అందులో చేసిన పాత్ర ఏమంత పేరు తెచ్చేది కాకపోవడంతో రాజ్ తరుణ్ కి ఒరిగింది ఏమి లేదు. కొత్త రిలీజుల్లో ఒక్కటి ఆడినా కొంత ఊరట దక్కేది కానీ ఇప్పుడు కొండంత భారం భలే ఉన్నాడే మీదే ఉంది. ఎంతవరకు మోయగలదో చూడాలి.