మోడరన్ మాస్టర్స్ రాజమౌళి మెప్పించిందా

ఒక భారతీయ దర్శకుడికి అరుదైన గౌరవం ఇస్తూ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీయడమనేది సంచలనమే. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందే కంటెంట్ ని మాత్రమే పరిగణించే ఓటిటి దిగ్గజం మోడరన్ మాస్టర్స్ పేరుతో విడుదల చేసిన సిరీస్ లో ఎస్ఎస్ రాజమౌళి గురించి 74 నిమిషాల వీడియోని ప్రపంచానికి పరిచయం చేసింది. ఒకరకంగా ఇది జక్కన్న బయోపిక్ అని చెప్పాలి. ట్రైలర్ కట్ చూశాక ఇందులో చాలా విశేషాలు ఉంటాయని అభిమానులు ఆశించారు. తెరవెనుక సంగతులతో పాటు ఎప్పుడూ చూడని వీడియో ఫుటేజ్ చూడచ్చని ఎదురు చూశారు. క్లుప్తంగా రివ్యూ చేద్దాం.

రాజమౌళి బాల్యం, తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అర్ధాంగి (1996) సినిమాకు అసిస్టెంట్ గా చేరడం, రాఘవేంద్రరావుతో పరిచయం శాంతినివాసం టీవీ సీరియల్ తీయించడం, అటుపై స్టూడెంట్ నెంబర్ వన్ అవకాశం ఇలా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా వివరించుకుంటూ వెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రానాలు మాత్రమే హీరోల వైపు నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వగా కీరవాణి, కాంచి, రమా, కార్తికేయ తదితరులు ఫ్యామిలీ కబుర్లు చెప్పారు. ఎక్కడా విక్రమార్కుడు, యమదొంగ, సై, మర్యాదరామన్న లాంటి ఇతర హిట్ల ప్రస్తావన లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరుస్తుంది.

బాహుబలి, ఆర్ఆర్ఆర్, ఈగ, మగధీర, సింహాద్రిలను హైలైట్ చేయడం బాగానే ఉంది కానీ రవితేజ, నితిన్, సునీల్ లాంటి వాళ్లకు కూడా భాగం చేసి ఉండాల్సిందనే భావన కలుగుతుంది. ఎక్కువ డీటెయిల్స్ లేకుండా కొంచెం వేగంగానే పరిగెత్తించారు దర్శకుడు రాఘవ్ వర్మ. నిర్మాత అనుపమ చోప్రా ఇంటర్వ్యూ చేసే క్రమంలో బాగానే స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నారు. యష్ రాజ్ ఫిలింస్ అధినేత యాష్ చోప్రా ప్రయాణం గురించి ఇదే నెట్ ఫ్లిక్స్ తీసిన రొమాంటిక్స్ తరహాలో ఈ మోడర్న్ మాస్టర్స్ కూడా వివరాత్మకంగా ఎక్కువ ఎపిసోడ్లతో ఉంటే బాగుండేది. అభిమానులకు పూర్తి ఆకలి తీరలేదు.