చిరంజీవిని స్పెల్ బౌండ్ చేసిన సింహాద్రి

కొన్ని విశేషాలు స్టార్లు వాళ్ళుగా చెబితే తప్ప బయటికి రావు. తగిన సందర్భం కుదరాలంతే. ఇవాళ నెట్ ఫ్లిక్స్ సంస్థ రాజమౌళి మీద రూపొందించిన మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ సిరీస్ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.గంటన్నర పాటు ఆయన ప్రయాణం, కెరీర్ లో చూసిన ఎత్తుపల్లాలు, పని చేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేయడంతో అందరు హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏమేం చెప్పి ఉంటారానే ఆసక్తి ఇద్దరి ఫ్యాన్స్ లో అధికంగా ఉంది. మచ్చుకు ఒక సాంపిల్ చూద్దాం.

ఇది స్వయంగా చరణ్ చెప్పిందే. మగధీరకు ముందు ఆయన తండ్రి చిరంజీవి సింహాద్రి చూశారట. ఒక్కసారిగా మైండ్ బ్లోయింగ్ అనిపించే రేంజ్ లో జక్కన్న దర్శకత్వం చూసి నోట మాట రాలేదట. అంత మెగా స్టార్ నే కేవలం రెండో సినిమాతోనే మెప్పించిన దర్శక ధీర అప్పట్లోనే ఏ స్థాయిలో ప్రభావం చూపించారో ఈ ఉదాహరణను బట్టి అర్థం చేసుకోవచ్చు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే సింహాద్రి టైంలో చిరుకి గట్టి పోటీ ఇచ్చేవాడు వచ్చాడంటూ అప్పటి కొన్ని మీడియా సాధనాల్లో తారక్ పై కథనాలు వచ్చేవి. దానికి తగ్గట్టే సింహాద్రి ఆ టైంలో నెలకొల్పిన రికార్డులు మామూలువి కాదు.

ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో రాజమౌళి ఎంత పెద్ద స్థాయికి చేరినా బలమైన పునాది వేసింది మాత్రం ఖచ్చితంగా సింహాద్రినే. బాషా, సమరసింహారెడ్డి, ఇంద్ర తర్వాత హీరో తాలూకు ఫ్లాష్ బ్యాక్ ని వాటికన్నా శక్తివంతంగా పక్క రాష్ట్రంకి తీసుకెళ్లి మరీ మేజిక్ చేసిన జక్కన్న ఆ తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. కొన్ని నెలల క్రితం రీ రిలీజ్ చేసినప్పుడు సైతం ప్రేక్షకులు ఆదరించారు. ఒకరకంగా చెప్పాలంటే మగధీరకు పునాది వేసింది సింహాద్రినే అన్న మాట. దాని చూసి స్పెల్ బౌండ్ అయిన మెగాస్టార్ బహుశా అల్లు అరవింద్ కి చెప్పి ప్రాజెక్టుని లాక్ చేయించారేమో.