ఎన్టీఆర్ సినిమా.. అంతా బుస్సే

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. ‘హాయ్ నాన్న’ సినిమా తీసిన కొత్త దర్శకుడు శౌర్యువ్‌తో తారక్ జట్టు కట్టబోతున్నాడని.. ఆ చిత్ర నిర్మాతలే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నారని ఓ వార్త కొన్ని రోజుల కిందట బయటికి వచ్చింది. ఐతే నిర్మాతలు అడిగినపుడు తారక్‌ వీలును బట్టి చూద్దాం అని మాత్రమే అన్నాడని.. అంతకుమించి ఏమీ లేదని.. కానీ ఈ మాత్రానికే సినిమా ఓకే అయిపోయినట్లు, త్వరలోనే మొదలైపోతుందన్నట్లు వార్తలు పుట్టించేశారని ఇండస్ట్రీలో ఓ డిస్కషన్ నడిచింది.

ఐతే ముందు ఈ అప్‌డేట్ బయటికి వచ్చాక రెండు రోజులు చర్చ జరిగింది. తర్వాత అందరూ ఆ విషయాన్ని మరిచిపోయారు. కానీ రెండు రోజుల నుంచి మళ్లీ ఈ ప్రాజెక్టు గురించి ఊహాగానాలు మొదలైపోయాయి.

తారక్‌తో శౌర్యువ్ ఓ భారీ యాక్షన్ మూవీ చేయబోతున్నాడని.. అది రెండు భాగాలుగా ఉంటుందని.. 2026లో ఫస్ట్ పార్ట్, 2028లో సెకండ్ పార్ట్ రాబోతున్నాయని కూడా వార్తలు పుట్టించేశారు. రెండు భాగాలు.. రిలీజ్ ఎప్పుడు అనేది కూడా చెబుతుండడంతో ఈ ప్రచారం నిజమే కావచ్చని తారక్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. కానీ ఈ ప్రచారానికి స్వయంగా ఆ దర్శకుడే తెరదించాడు. కొన్ని రోజులుగా తారక్‌తో తన సినిమా గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. ఈ వార్తలు ఎలా పుట్టాయో కూడా తనకు తెలియదని శౌర్యువ్ స్పష్టం చేశాడు.

ఐతే తారక్‌తో తన సినిమా గురించి వస్తున్న వార్తలు నిజం కావాలని కోరుకుంటున్నానని.. ఏదో ఒక రోజు తారక్‌తో సినిమా తీస్తానని శౌర్యువ్ స్పష్టం చేశాడు. ‘హాయ్ నాన్న’ లాంటి సాఫ్ట్ మూవీ తీసిన శౌర్యువ్‌.. తారక్‌తో యాక్షన్ మూవీ తీయడం అంటే అదోలా అనిపించవచ్చు కానీ.. తనకు యాక్షన్ సినిమాలంటే ఇష్టమని, తర్వాతి చిత్రం ఆ జానర్లో ఉంటుందని మాత్రం శౌర్యువ్ ప్రమోషన్ల టైంలో చెప్పాడు.