వాకాడ అప్పారావు.. ఆయన ఎవరు.. ఏం చేస్తుంటారు అంటే చెప్పలేరేమో కానీ.. ఈ పేరును తెర మీద చాలాసార్లు చూశామని మాత్రం సినీ ప్రేక్షకులు చెప్పగలరు. ఒకప్పుడు తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసి.. ఆయా చిత్రాల నిర్మాణ వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి చూసుకునేవారాయన.
ఆర్.బి.చౌదరి తెలుగులో నిర్మించిన సినిమాకు ఆయన డబ్బులు పెట్టి ఊరుకునేవారు. మేకింగ్ దగ్గర్నుంచి విడుదల వరకు అన్నీ చూసుకునేది ఈ వాకాడ అప్పారావే. ఆయన తర్వాతి కాలంలో నిర్మాతగా మారి నందమూరి బాలకృష్ణతో ‘మహారథి’ అనే సినిమా తీశారు. ఐతే ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఈ సినిమా వచ్చి పన్నెండేళ్లు దాటిపోగా.. దాని కోసం చేసిన అప్పుల్ని ఇప్పటికీ కడుతున్నట్లు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వాకాడ అప్పారావు చెప్పడం గమనార్హం.
‘మహారథి’ సినిమా మొదలుపెట్టడానికి ముందు ఫైనాన్స్ చేయడానికి కొందరు ముందుకు వచ్చారని.. కానీ మేకింగ్ దశలో ఉండగా వాళ్లు చేతులెత్తేయడంతో చాలా ఇబ్బంది పడ్డట్లు అప్పారావు వెల్లడించారు. 250 మంది బృందంతో నైనిటాల్‌లో షూటింగ్ చేస్తుండగా.. ఫైనాన్షియర్లు తాము డబ్బులు ఇవ్వలేమని చెప్పడంతో దిక్కు తోచలేదని.. ఆ స్థితిలో దొరికిన ప్రతి చోటా అప్పులు చేస్తూ వెళ్లానని.. పది లక్షలు చేతికొస్తే దాన్ని చిత్ర బృందానికి ఇవ్వడం.. మళ్లీ ఇంకొంత డబ్బు కోసం ప్రయత్నించడం.. ఇలా తాను మేకింగ్ గురించి ఏమీ పట్టించుకోకుండా ఫైనాన్స్ సమకూర్చుకోవడానికే పరిమితం అయ్యానని.. చివరికి ఒక మిత్రుడు బ్యాంకు లోన్ ద్వారా రూ.4 కోట్లకు పైగా అప్పు ఇప్పించడంతో అతి కష్టం మీద సినిమా పూర్తి చేయగలిగామని అప్పారావు తెలిపారు.
స్క్రిప్టు విషయంలో దర్శకుడు పి.వాసు, రచయిత తోటపల్లి మధులను నమ్మామని.. ఫైనాన్స్ సమస్యల్లో పడి తాను మేకింగ్ పట్టించుకోలేదని ఆయన చెప్పారు. చివరికి సినిమాకు ఆశించిన ఫలితం రాలేదని.. దీంతో భారీగా అప్పులు మిగిలాయని.. చాలా ఏళ్ల పాటు అవి కడుతూ వచ్చానని.. ఇప్పటికీ ఒక ఫైనాన్షియర్‌కు అప్పు చెల్లిస్తూనే వస్తున్నానని అప్పారావు తెలిపారు.