మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15 విడుదలకు రెడీ అవుతోంది. డబుల్ ఇస్మార్ట్ తో పోటీ బలంగా ఉన్నప్పటికీ టీమ్ విజయం పట్ల చాలా నమ్మకంగా ఉంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ గా రూపొందిన ఈ మాస్ ఎంటర్ టైనర్ ద్వారా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటలు అంచనాలు పెంచేయగా క్రమం తప్పకుండా చేస్తున్న ప్రమోషన్లు హైప్ పెంచుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ ఆర్కె సినీప్లెక్స్ లో గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. కంటెంట్ పరిచయం చేశారు.
సుమారుగా 1995 ప్రాంతం. ఆదాయపు పన్ను శాఖలో పని చేసే బచ్చన్ (రవితేజ) ది ముక్కుసూటి మనస్తత్వం. ఓ అందమైన అమ్మాయి (భాగ్యశ్రీ బోర్సే) ని చూసి తొలిచూపులోనే ప్రేమించి మనసు ఇచ్చి పుచ్చుకుంటాడు. దేశంలో దరిద్రం కన్నా ప్రమాదకరమైన నల్ల డబ్బుని అరికట్టే క్రమంలో ఊళ్ళోనే పేరుగాంచిన ఒక పెద్ద మనిషి (జగపతిబాబు) ఇంటి మీదకు బచ్చన్ రైడింగ్ కు వెళ్తాడు. లెక్కలేనంత నోట్ల కట్టలు, బంగారం బయట పడతాయి. కథ ఇక్కడే మొదలవుతుంది. బచ్చన్ లైఫ్ తో పాటు కుటుంబం ప్రమాదంలో పడుతుంది. వ్యవస్థను సవాల్ చేసిన ఆ తిమింగలాన్ని ఎలా ఆపాడో తెరమీద చూడాలి.
ముందు నుంచి చెబుతున్నట్టు హరీష్ శంకర్ ఒరిజినల్ వెర్షన్ అంత సులభంగా స్ఫూరణకు రాకుండా ఉండేలా మిస్టర్ బచ్చన్ లో భారీ మార్పులే చేశారు. విజువల్స్, మేకింగ్ అన్నీ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు, ఆయనంక బోస్ ఛాయాగ్రహణం ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. ఇదింకా టీజరే కాబట్టి ట్రైలర్ వచ్చాక అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా ఉన్నారు. ఆగస్ట్ 14నే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు ప్లాన్ చేసుకుంటున్న మిస్టర్ బచ్చన్ టైటిల్ కు తగ్గట్టు అంతే పవర్ ఫుల్ గా ఉంటే సూపర్ హిట్టే.