మళ్లీ సినిమా థియేటర్లు మొదలవుతాయ్ కానీ ఇక మీదట ఓటిటి అనేది కూడా సినిమా బిజినెస్‍కి అత్యంత కీలకంగా మారుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. రీజనల్ మార్కెట్‍కి పరిమితమయ్యే సినిమాలకు ఒక విధమైన డిమాండ్ వుంటే, ఇతర భాషలకు కూడా అప్పీల్ అయ్యే సినిమాలకు ఓటిటిల నుంచి ఇంకా ఎక్కువ డిమాండ్ వుంటుంది. అంటే ఏ సినిమాల్లో అయితే అన్ని భాషల ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే స్టార్ కాస్ట్ వుంటుందో వాటికి ఎక్కువ రేటు పలుకుతుందన్నమాట. దీంతో పాన్ సౌత్ ఇండియా రీచ్ వున్న హీరోయిన్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది.
ఉదాహరణకు సమంత, అనుష్క, రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి తదితర హీరోయిన్లకు సౌత్ ఇండియా అంతటా పాపులారిటీ వుంది. అనుష్క అయితే ఇండియా అంతటికీ సుపరిచితమే. సమంత కూడా ఇప్పుడు అదే పాన్ ఇండియా అప్పీల్ కోసం చూస్తోంది. ఒకే రాష్ట్రానికి, భాషకు పరిమితమైన హీరోయిన్ల కంటే బోర్డర్స్తో పని లేని హీరోయిన్లకు ఇకపై డిమాండ్ ఎక్కువన్నమాట.
గతంలో కంటే ఇకపై హీరోయిన్లు సూట్‍కేసులలో జీవించడానికి… అంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్లయిటెక్కి పక్క రాష్ట్రాలకు వెళ్లడానికి ఇష్టపడతారన్నమాట. ఈ ఓటిటి జమానాలో మల్టీ లాంగ్వేజెస్‍లో పాపులర్ అయిన హీరోయిన్ల పారితోషికం కూడా పెరిగే అవకాశాలు పుష్కలం. అంతెందుకు ఈ టైమ్‍లో కేవలం బాలీవుడ్‍కి పరిమితం అయిపోకుండా దక్షిణాదిలోను తమకు రీచ్ కావాలని అక్కడి నటులు కోరుకుంటున్నారంటే ఈ ట్రెండు మహిమ ఏమిటో తెలియడం లేదూ?