రిస్క్ గురించి ఆలోచిస్తే మంచిదేమో

బడ్జెట్ తో సంబంధం లేకుండా సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా ఆడతాయని బలగం, రైటర్ పద్మభూషణ్ లాంటివి పలుమార్లు ఋజువు చేశాయి. కంటెంట్ ఉంటే హీరో ఎవరనేది పట్టించుకోమని ప్రేక్షకులూ తేల్చి చెప్పారు. కానీ ఇవన్నీ బలమైన పోటీ లేని సమయంలో మంచి అవకాశాన్ని వాడుకుంటూ బాక్సాఫీస్ దగ్గర లాభపడినవి. కానీ ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న ఆయ్, 35 చిన్న కథ కాదు ఏకంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి మాస్ బొమ్మలతో క్లాష్ కు సిద్ధపడాల్సి రావడం ఊహించని పరిణామం. ఎవరు ముందు ప్రకటించారనేది ఇక్కడ అసలు పాయింట్ కాదు.

ఎంత మంచి వీకెండ్ అయినా సరే స్టార్ హీరోల సినిమాలు ఊరిస్తున్నప్పుడు జనాలు చిన్న బడ్జెట్ చిత్రాల వైపు అంత సులభంగా మొగ్గు చూపరు. ముఖ్యంగా థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ నిర్ణయాల్లో పిల్లలు, యూత్ పాత్ర చాలా ఉంటుంది. వాళ్ళలో అధిక శాతం రవితేజ, రామ్ ల వైపు ఆకర్షితులు కావడం సహజం. ఆయ్ నిర్మాత బన్నీ వాస్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తమకు తక్కువ స్క్రీన్లు దొరుకుతాయని, మొదటి వీకెండ్ అయ్యాక జరిగే పికప్ మీద నమ్మకంతో బరిలో దిగుతున్నామని అంటున్నారు. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ టాక్ మీద ఈ పరిణామం ఆధారపడి ఉంటుంది.

పెద్ద బ్యానర్ల మద్దతు ఎంత ఉన్నా, నిర్మాతలకు నమ్మకమున్నట్టు ఆయ్, 35 చిన్న కథ కాదు మంచి సినిమాలు కావొచ్చు. కావాలి కూడా. కానీ అవి ఆడియన్స్ కి బాగా రీచ్ కావడం కూడా కీలకం. ఎంత ఇండిపెండెన్స్ డే అయినా సరే ఇదేమి సంక్రాంతి సీజన్ కాదు. అందరూ రోజుల తరబడి సెలవులు ఎంజాయ్ చేయడానికి. స్వాతంత్ర దినోత్సవం గురువారం రావడం వల్ల వారాంతం పెద్దగా కనిపిస్తోంది తప్ప ఆ వీక్ లో సెకండ్ సాటర్ డే కూడా లేదు. అలాంటప్పుడు హాలిడేస్ ని ఎక్కువగా ఊహించుకున్నా ఇబ్బందే. ఒకవేళ తంగలాన్ కు హిట్ టాక్ వస్తే అదొక కొత్త చిక్కు. సో నిర్ణయాలు ఏమైనా మారతాయేమో చూడాలి.