వచ్చే నెల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త సినిమాల తాకిడి మాములుగా లేదు. ఒకే రోజు క్లాష్ కావడం వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయని తెలిసినా కూడా సుదీర్ఘమైన వీకెండ్ ని వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. గురువారం జాతీయ సెలవు దినం కావడంతో మొత్తం నాలుగు రోజుల వీకెండ్ దక్కనుంది. పాజిటివ్ టాక్ వస్తే చాలు థియేటర్లు కళకళలాడతాయి. ఎవరికి వారు కంటెంట్ మీద నమ్మకంతో క్లాష్ కు సిద్ధపడుతున్నారు తప్పించి రాజీకి ఎస్ అనడం లేదు. ట్విస్టు ఏంటంటే వాటిలో రెండు స్టార్ క్యాస్టింగ్ లేని చిన్న బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. అందుకే పోటీ రసవత్తరంగా ఉంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మీద క్రమంగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు ఊర మాస్ గా ఉండటంతో పాటు కంటెంట్ గురించి వస్తున్న లీకులు ఆసక్తిని పెంచుతున్నాయి. గీత ఆర్ట్స్ 2 నిర్మాణంలో రూపొందిన ‘ఆయ్’ ప్రమోషన్ల మీద నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కేవలం వర్షం నీటికే కోటి రూపాయలకు పైగా ఖర్చయ్యిందని అల్లు అరవింద్ చెప్పడం చూస్తే మ్యాటర్ బలంగా ఉన్నట్టుంది. మ్యాడ్ తో పరిచయమైన తారక్ బావమరిది నవీన్ నార్నెకు ఆయ్ సక్సెస్ చాలా కీలకం కానుంది.
నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన ’35 చిన్న కథ’ కాదు సైతం రేసులో ఉంది. పబ్లిసిటీని వెరైటీగా చేస్తున్నారు. విజువల్స్ చూస్తే హోమ్లీ ఎంటర్ టైనరనే నమ్మకం కలుగుతోంది. ఇవన్నీ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు. విక్రమ్ ‘తంగలాన్’ సైతం ఇప్పుడీ బరిలో దిగడం అధికారికంగా ఖరారు కావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ట్రైలర్ చూశాక మూవీ లవర్స్ మతులు పోయినంత పనైంది. ఇదంతా పక్కనపెడితే రవితేజ మిస్టర్ బచ్చన్ ని సైతం ఆగస్ట్ 15కి దించాలని చూస్తున్నారు కానీ ఇంకా ప్రకటన ఇవ్వలేదు. ఇది వచ్చినా రాకపోయినా ఆల్రెడీ ఉన్న కాంపిటీషన్ బాక్సాఫీసుని వేడిగా మార్చేసింది.