హిట్టు ఫ్లాపు పక్కనపెడితే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న యూత్ హీరో రాజ్ తరుణ్ ఇటీవలే లావణ్య అనే అమ్మాయికి సంబంధించిన పోలీస్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విచారణ స్టేజిలో ఉంది. ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ కొత్త సినిమా పురుషోత్తముడు ఈ నెల 26 విడుదలకు సిద్ధమవుతోంది. మాములుగా హీరో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిర్మాతలు వాయిదా వైపు మొగ్గు చూపిస్తారు. కానీ ఈ ప్రొడ్యూసర్స్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. బహుశా తను లేకుండానే ప్రమోషన్లు చేస్తారేమో. ఇవాళ ట్రైలర్ ని తీసుకొచ్చారు.
కథ పూర్తిగా కాకపోయినా దాదాపు అర్థమయ్యేలా రెండున్నర నిమిషాల వీడియోని కట్ చేశారు. ధనవంతుడైన రచిత్ రామ్ (రాజ్ తరుణ్) యువతకు ఆదర్శంగా నిలిచేలా వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని కారణాల వల్ల ఒక పల్లెటూరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఉన్న స్థానిక రాజకీయాలు, గూండాల దందాను తట్టుకుని రైతులకు, జనాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంటాడు. కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టాక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు రామ్ నిజంగా బిజినెస్ మ్యానా లేక ఇంకేదయినా నేపథ్యం ఉందా అనేది థియేటర్లలో చూశాకే అర్థమవుతుంది.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, కౌసల్య, బ్రహ్మాజీ, మురళీశర్మ, సమీర్ ఇలా పెద్ద క్యాస్టింగ్ తో పాటు పిజి విందా, గోపి సుందర్ లాంటి టాప్ టెక్నీషియన్స్ దీనికి పని చేయడం విశేషం. కంటెంట్ చూస్తుంటే మహేష్ బాబు శ్రీమంతుడు గుర్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు. ఒకరకంగా చెప్పాలంటే రాజ్ తరుణ్ దానికి జూనియర్ లా కనిపిస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇంత స్కేల్ లో తను సినిమా చేయడం ఇదే మొదటిసారి. తిరగబడరా సామీ కూడా మాస్ సినిమానే కానీ ఈ పురుషోత్తముడులో క్లాస్ ని మిక్స్ చేశారు. చికాకులో ఉన్న రాజ్ తరుణ్ కు దీని ఫలితం స్వాంతన చేకూరుస్తుందేమో చూడాలి.