సైంధవ్ విలన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ విలక్షణ నటుల్లో ప్రముఖంగా వినిపించే పేరు నవాజుద్దీన్ సిద్ధిక్. అమీర్ ఖాన్ సర్ఫరోష్ లో జైల్లో దెబ్బలు తినే ఒక మాములు గూండా క్యారెక్టర్ దగ్గరి నుంచి స్టార్ డైరెక్టర్లు కోరిమరీ పిలిపించుకునే స్థాయికి చేరుకున్నాడు. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంలో అతనికి అతనే సాటి. అయితే తాజాగా తను చేసిన కామెంట్స్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. సౌత్ సినిమాల్లో తాను కేవలం ఎక్కువ పారితోషికం ఇస్తారని చేశానని, సూపర్ స్టార్ రజనీకాంత్ పేట అందుకే ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పి బాంబు పేల్చాడు. ఈ విషయంలో తనకు గిల్టీగా కూడా ఉందని ఒప్పుకున్నాడు.

నిజానికి వెంకటేష్ సైంధవ్ ని బాగా గమనిస్తే నవాజుద్దీన్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. భాష రాని ఇబ్బందితో పాటు తెచ్చి పెట్టుకున్న నటన స్పష్టంగా కనిపిస్తుంది. తను అదే అంటున్నాడు. ఏదో పేపర్ తీసుకుని బట్టి పట్టి యాడ్ ఫిలిం చేస్తున్న ఫీలింగ్ కలుగుతుందని, ఎక్కువ డబ్బులు ఆఫర్ చేయకపోతే అసలు వచ్చే వాడినే కాదనే రీతిలో అతను మాట్లాడ్డం షాక్ కలిగించేదే. అసలు బాలీవుడ్ విలన్లు మనకు కొత్త కాదు. అమ్రిష్ పూరి, సురేష్ ఒబెరాయ్ కాలం నుంచి ఇప్పటి బాబీ డియోల్, అర్జున్ రామ్ పాల్ దాకా ఎందరో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాలు పంచుకున్నారు.

కానీ ఇంత ఓపెన్ గా నవాజుద్దీన్ లాగా బయట పడిన వాళ్ళు లేరు. లాంగ్వేజ్ మీద పట్టు సాధించకపోవడం పట్ల సిగ్గు పడుతున్నానని చెబుతున్న ఈ వర్సటైల్ యాక్టర్ ఇకపై మారేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. మంచిదే. విలన్ల కొరత తీవ్రంగా ఉన్న టాలీవుడ్ లో నవాజుద్దీన్ లాంటి వాళ్ళు ఎక్కువ సినిమాలు చేస్తే మంచి కెరీర్ దక్కతుంది. సైంధవ్ ఆడలేదు కానీ అది కనక సూపర్ హిట్ అయ్యుంటే మరిన్ని అవకాశాలు క్యూ కట్టేవి. వరస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న నవాజుద్దీన్ సిద్ధిక్ వీలైనంత త్వరలో తెలుగులో మరో క్రేజీ మూవీలో భాగమైతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరిక.