తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో రామ్ చరణ్ సినిమా అన్నపుడు మెగా అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ వారిలో ఎగ్జైట్మెంట్‌ను చాలా వరకు తగ్గించే పరిణామాలు జరిగాయి గత మూణ్నాలుగేళ్లలో. ఈ సినిమా చిత్రీకరణ బాగా ఆలస్యమైంది. పలుమార్లు షెడ్యూల్స్‌కు బ్రేకులు పడ్డాయి. సినిమా గురించి సరైన అప్‌డేట్స్ లేవు. రిలీజ్ గురించి ఎంతకీ క్లారిటీ రాలేదు.
ఇవన్నీ తట్టుకున్నారు కానీ.. శంకర్ నుంచి ఇటీవలే వచ్చిన ‘ఇండియన్-2’ సినిమా చూశాక మెగా ఫ్యాన్స్ జావగారిపోయారు. శంకర్ కెరీర్లోనే అత్యంత విసిగించిన సినిమాగా ఇది పేరు తెచ్చుకుంది. అంతే కాక సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగానూ నిలిచింది. దీంతో ‘గేమ్ చేంజర్’ను శంకర్ ఎలా తీర్చిదిద్దాడో, దాని ఫలితం ఎలా ఉంటుందో అన్న టెన్షన్ పట్టుకుంది చరణ్ అభిమానులకు.
ఐతే ఇలాంటి టైంలో ‘గేమ్ చేంజర్’ గురించి పూర్తి భరోసా ఇచ్చాడు ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్న సాయిమాధవ్ బుర్రా. “గేమ్ చేంజర్ ఒక కంప్లీట్ ప్యాకేజీలా ఉంటుంది. శంకర్ గారి సినిమా నుంచి సగటు ప్రేక్షడు ఆశించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రం చరణ్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. నేను ‘గేమ్ చేంజర్’ సెట్స్‌కు రెగ్యులర్‌గా వెళ్లను. కానీ శంకర్‌గారితో టచ్‌లోనే ఉంటాను. ఆయన తొలిసారి తెలుగులో చేస్తున్న చిత్రమిది. అందుకే తెలుగు డైలాగ్స్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరు. ఉన్నత ప్రమాణాలకు ఏమాత్రం తక్కుగా ఉన్నా అంగీకరించరు. నాతో శంకర్ గారు తెలుగులోనే మాట్లాడతారు. చాలామంది తెలుగు వారి కంటే ఆయన తెలుగు మెరుగ్గా ఉంటుంది” అని సాయిమాధవ్ చెప్పుకొచ్చారు. మరి సాయిమాధవ్ చెబుతున్నట్లే ‘గేమ్ చేంజర్’ ఒక ప్యాకేజీలా, చరణ్ కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించేలా ఉంటే అందరికీ సంతోషమే.