యూత్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో ‘క’గా రాబోతున్నాడు. సాధారణంగా ఒక్క అక్షరంతో వచ్చే సినిమాలు చాలా తక్కువ. అందుకే టైటిల్ నుంచే ‘క’ వైరెటీగా అనిపిస్తోంది. వినరో భాగ్యము విష్ణుకథ డీసెంట్ సక్సెస్ తర్వాత కిరణ్ కు మీటర్, రూల్స్ రంజన్ రూపంలో రెండు బ్రేకులు పడ్డాయి. రెగ్యులర్, కమర్షియల్ జానర్లు చేయడం వల్ల ప్రేక్షకులు అంగీకరించడం లేదని గుర్తించి ఈసారి గేరు మార్చి కొత్తదనం వైపు అడుగులు వేశాడు. క చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఏఏఏ మల్టీప్లెక్స్ లో టీజర్ విడుదలయ్యింది. స్టోరీలోని కొన్ని కీ ఎలిమెంట్స్ ని పరిచయం చేశారు.
ఇది కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కథ. ఎక్కడో సుదూర గ్రామీణ ప్రాంతంలో పోస్ట్ మ్యాన్ గా పని చేస్తుంటాడో యువకుడు (కిరణ్ అబ్బవరం). అతనికున్న అలవాటు ఉత్తరాలను తెరిచి చదవడం. ఇది తప్పయినా మానుకోలేకపోతాడు. తనకు తెలిసిన మంచిని చేస్తూనే లోపల తెలియని చెడు ఒకటి పెరుగుతోందని గుర్తించలేకపోతాడు. దీంతో ఊళ్ళో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. హత్యలు మొదలవుతాయి. గ్రామ దేవతకు ముడిపడిన కొన్ని విషయాలు భయపెడతాయి. అసలు క అంటే ఎవరు, ఈ మిస్టరీ ఎలా జరుగుతోంది, అతను వెతుకుతున్న రహస్యం ఏంటనేది అసలు స్టోరీ.
టెక్నికల్ గా ‘క’ మంచి స్టాండర్డ్ లో కనిపిస్తోంది. సస్పెన్స్, థ్రిల్, క్రైమ్ ఈ మూడు అంశాలను మిక్స్ చేస్తూ దర్శక ద్వయం సుజిత్ అండ్ సందీప్ దీన్ని తీర్చిదిద్దారు. సామ్ సిఎస్ నేపధ్య సంగీతం ఎలివేషన్ కు ఉపయోగపడింది. విరూపాక్ష, మంగళవారం తరహాలో డిఫరెంట్ అటెంప్ట్ అనిపిస్తున్న ‘క’లో కిరణ్ అబ్బవరం లుక్, మీసకట్టు విభిన్నంగా ఉన్నాయి. మాస్ టచ్ కూడా ఇచ్చారు. ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్టుని మొదటిసారి ట్రై చేస్తున్న కిరణ్ ట్రెండ్ కు తగ్గట్టు సరైన జానరే ఎంచుకున్నాడు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates