దిల్ రాజు గారి అదృష్టం బాగుంది

ఏం జరిగినా మన మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. దిల్ రాజు గారి విషయంలో ఇది అక్షరాలా నిజమనిపిస్తుంది. నిన్న విడుదలైన భారతీయుడు 2 ఫలితం ఏంటో తేలిపోయాక చూశాక ఆయన హమ్మయ్యా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దర్శకుడు శంకర్ ముందు ఈ ప్యాన్ ఇండియా మూవీ తీయాలనుకున్నది దిల్ రాజుతోనే.

ఆ మేరకు అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుని కమల్ హాసన్ తో పాటు ఫోటోలకు స్టిల్స్ కూడా ఇచ్చారు. అయితే ప్రారంభం కావడంలో ఆలస్యంతో పాటు శంకర్ కోట్ చేసిన బడ్జెట్ వర్కౌట్ కాదని భావించి వదిలేసుకున్నాక జరిగిన పరిణామాల్లో లైకాకు వెళ్ళింది.

అప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన దిల్ రాజుకి శంకర్ ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథ చెప్పడం, అది కాస్తా రామ్ చరణ్ దగ్గరికి వెళ్లి గ్రీన్ సిగ్నల్ అందుకోవడం చకచకా జరిగిపోయాయి. అదే గేమ్ ఛేంజర్. ఇది కూడా విపరీతమైన ఆలస్యానికి గురైనప్పటికీ దిల్ రాజు ఒక్కరే దీని భారం మోయడం లేదు. జీ సంస్థ భాగస్వామ్యం తీసుకుంది.

భారతీయుడు 2 కంటే గేమ్ ఛేంజర్ కు క్రేజ్ ఎక్కువ. ఆర్ఆర్ఆర్ హీరోగా చరణ్ ఇమేజ్ నార్త్ మార్కెట్ లో బాగా పని చేస్తుంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరంగా క్రేజీ ఆఫర్లను తీసుకొస్తుంది. ఇదంతా ఇండియన్ 2 వల్ల జరిగేది కాదు.

ఎలా చూసుకున్నా భారతీయుడు 2 తప్పిపోయి గేమ్ ఛేంజర్ రావడం వల్లే దిల్ రాజుకి అధిక శాతం ప్రయోజనం కలగబోయేది వాస్తవం. పైగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యలో క్యామియోలో కనిపించి సోలో హీరోగా దర్శనం ఇవ్వలేదు. మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు.

సరైన ప్రమోషనల్ కంటెంట్ తో కనక జనంలోకి సినిమాను తీసుకెళ్లగలిగితే ఓపెనింగ్స్ తోనే రికార్డులు మొదలవుతాయి. పైగా శంకర్ బ్రాండ్ తమిళనాడులో ఉపయోగపడుతుంది. డిసెంబర్ లో విడుదలని వినిపిస్తోంది కానీ ఫైనల్ ఎడిటింగ్ అయిపోయేవరకు డేట్ చెప్పలేనని శంకర్ నొక్కి చెబుతున్నారు.