రెండు వారాల కిందట ‘కల్కి 2898 ఏడీ’ రిలీజైనపుడు దాని మీద ఉన్న అంచనాల దృష్ట్యా పోటీగా ఇండియాలో మరే భాషలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ చేయలేదు. తెలుగులో అయితే అంతకు కొన్ని వారాల ముందు నుంచే సరైన సినిమాలు పడక బాక్సాఫీస్ స్లంప్ నడవడం ఆ చిత్రానికి ప్లస్ అయింది.
ఆ వారమే కాక తర్వాతి వారం కూడా తెలుగులో వేరే రిలీజ్‌లు ఏవీ లేవు. దీంతో రెండు వారాల పాటు కల్కి డ్రీమ్ రన్ నిరాటంకంగా సాగిపోయింది. తొలి వీకెండ్ తర్వాత కొంచెం డల్లయిన ఆ చిత్రం.. రెండో వీకెండ్లో అదరగొట్టింది. ఆ తర్వాత మళ్లీ కొంచెం జోరు తగ్గింది.
ఈ వారం ‘ఇండియన్-2’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడంతో ఇక ‘కల్కి’ రన్ దాదాపు ముగిసినట్లే అనుకున్నారు. కానీ ‘ఇండియన్-2’ డిజాస్టర్ టాక్‌తో మొదలై ‘కల్కి’ కలెక్షన్లకు మళ్లీ కీ ఇచ్చేలా కనిపిస్తోంది. తెలంగాణ వరకు ‘ఇండియన్-2’కు టికెట్ల ధరలు పెంచినా సరే.. తొలి రోజు ఉన్నంతలో బాగానే ఈ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీలే కనిపించాయి.
ఓపెనింగ్స్ కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ టాక్ మరీ దారుణంగా ఉండడంతో సినిమా వీకెండ్లో కూడా నిలబడడం కష్టమే అనిపిస్తోంది. రెండో రోజు నుంచి థియేటర్లు వెలవెలబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘కల్కి’ కచ్చితంగా వీకెండ్లో అడ్వాంటేజ్ తీసుకుంటుందనడంలో సందేహం లేదు. ‘కల్కి’కి ఆల్రెడీ టికెట్ల ధరలు తగ్గాయి. నార్మల్ రేట్లతో నడుస్తోంది.
‘ఇండియన్-2’కేమో రేట్లు కూడా ఎక్కువ. టాక్ లేని సినిమాకు ఎక్కువ రేట్లు పెట్టి వెళ్లడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు. దాని కంటే పాత సినిమా అయినా సరే.. విజువల్ వండర్‌గా పేరున్న ‘కల్కి’ని నార్మల్ రేట్లతో చూసేందుకే ఉత్సాహం చూపిస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి రన్ ముగిసిందనుకున్న దశలో ‘కల్కి’ మరిన్ని రోజులు చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది.