రెండు భాగాలకు మించి నిఖిల్ స్వయంభు

ఇప్పటి ట్రెండ్ లో సీక్వెల్ అనేది చాలా మాములు విషయమైపోయింది. బాహుబలితో ఎప్పుడైతే ఈ పోకడ రాజమౌళి మొదలుపెట్టారో తర్వాత కెజిఎఫ్ నుంచి ఇది ఊపందుకుంది. పుష్ప దాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఒకప్పుడు నెగటివ్ సెంటిమెంట్ గా ఉన్న కొనసాగింపుల సిరీస్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఫార్ములాగా మారిపోయి నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తోంది. సలార్ 2, కల్కి 2898 ఏడి 2 లాంటివి నిర్మాణానికి వెళ్ళక ముందే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. భారతీయుడు 2 ఇంకో అడుగు ముందు వేసి ఏకంగా మూడో భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అంతకు మించి అనేలా ఉండబోతోందట. డార్లింగ్ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ నభ నటేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం బయట పడింది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి మొదటిసారి కథ చెప్పినప్పుడు ఇది మూడు నాలుగు భాగాల దాకా వెళ్లే అవకాశమున్న సబ్జెక్టని, ప్రస్తుతం రెండు పార్ట్స్ తో మొదలుపెడతామని చెప్పారట. అంటే ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే హాలీవుడ్ అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ లాగా వరసగా ప్లాన్ చేశారన్న మాట. నిఖిల్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా స్వయంభు రూపొందుతోంది.

వెబ్ సిరీస్ తరహాలో ప్యాన్ ఇండియా మూవీస్ ఇలా భాగాలుగా రావడం రాబోయే రోజుల్లో మరింత ఊపందుకునేలా కనిపిస్తోంది. బాలీవుడ్ లో ధూమ్ లాంటి వాటితో ఎప్పుడో ఈ ధోరణి తీసుకొచ్చినా పార్ట్ 2 మీద హైప్ ని పెంచడంలో దక్షిణాది దర్శకులు చూపించిన క్రియేటివిటీ, ప్లానింగ్ ఇంకెవరి వల్ల అవ్వలేదన్నది వాస్తవం. స్వయంభు విడుదల తేదీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నభ నటేష్ తో పాటు సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ గ్రాండియర్ కోసం నిఖిల్ కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. చూస్తుంటే రిలీజ్ 2025లో ఉండబోతోందనే సూచన స్పష్టం.