వెబ్ సిరీస్ మీద భగ్గుమన్న CA సంఘం

కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టి వెబ్ సిరీస్ తీయడంలో నెట్ ఫ్లిక్స్ పాటించే స్ట్రాటజీనే వేరు. కంటెంట్ కంటే కాంట్రావర్సినే ఆ కంపెనీను ఎక్కువగా ఆకట్టుకుంటుందని డిజిటల్ వర్గాలు బహిరంగంగానే కామెంట్ చేసుకుంటాయి. ఇటీవలే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ మహారాజ్ విడుదలకు ముందు ఎంత దుమారం రేపిందో చూశాం. దర్శకుడు, నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. బొమ్మ డిజాస్టర్ అయిపోయింది కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు కానీ లేదంటే అందులోని వివాదాస్పద అంశాల పట్ల సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగేది.

తాజాగా మరో వెబ్ సిరీస్ విషయంలో నెట్ ఫ్లిక్స్ ఇబ్బందులు ఎదురుకుంటోంది. త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్ తాలూకు ట్రైలర్ కాంట్రవర్సీకి కేంద్రంగా మారుతోంది. ఇందులో కథ ప్రకారం సిఏ చదువులో టాప్ ర్యాంకర్ గా నిలిచిన హీరో ఒంటరి మహిళలకు లైంగిక సేవలు అందిస్తుంటాడు. అంటే కాల్ బాయ్ తరహాలో అన్న మాట. దీన్ని చూసిన ఐసిఏఐ ( ఇన్స్ టిట్యూట్ అఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్) భగ్గుమంది. ఎంతో ఉన్నతమైన వృత్తిని ఇలా చూపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ డాక్టర్ రోహిత్ రువాతియ అగర్వాల్ అనే వ్యక్తి ఐఎఫ్ఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించాడు.

కాకపోతే సినిమా అనేది ఒక కాల్పనిక మాధ్యమం. వృత్తిని బట్టి పెంచడం తగ్గించడం లాంటివి ఉండవు. డాక్టర్లు, లాయర్లు, మినిస్టర్లు ఇలా ఎన్నో ఉన్నత విద్యావంతుల చీకటి కోణాలను తెరమీద చూపించడం కొత్తేమి కాదు. అలాంటిది సిఏలను మాత్రం చాలా ప్రత్యేకం, మమ్మల్ని మినహాయించాలని చెప్పడం వింతే. ఆ మాటకొస్తే కార్పొరేట్ కంపెనీల వందల వేల కోట్ల మోసాల వెనుక చక్రం తిప్పేది ఎవరో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇప్పుడీ మ్యాటర్ కోర్టు దాకా వెళ్తుందో లేదో కానీ మహరాజ్ అంత సీరియస్ ఇష్యూ కాకపోవచ్చని పరిశీలకుల అభిప్రాయం. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ మొదలుకానుంది.