యువ హీరోల చొరవకు శభాష్ అనాల్సిందే

తండ్రి కూతుళ్ళ వీడియోని తీసుకుని దాని మీద అసభ్యకర వ్యాఖ్యలతో లైవ్ నిర్వహించిన కేసులో యుట్యూబర్ ప్రణీత్ హనుమంతు నిన్న అరెస్ట్ కావడం సంచలనం రేపింది. సోషల్ మీడియా బలమెంతో మరోసారి ఋజువయ్యింది. సామాజిక మాధ్యమాల పాత్ర ఎంత ఉన్నా ఈసారి టాలీవుడ్ యువ హీరోలు తీసుకున్న చొరవే ఇంత గొప్ప ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. ముందుగా సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక ప్రశంసలు దక్కాల్సిందే. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులను ట్యాగ్ చేయడంతో పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ దృష్టికి దీన్ని త్వరగా తీసుకెళ్లడంలో సుప్రీమ్ హీరో చూపించిన చొరవ గొప్పది.

తర్వాత మంచు మనోజ్ ఇంతే సీరియస్ గా ఈ ఇష్యూని మరో నలుగురికి తెలిసేలా చేయడంతో క్రమంగా ఇతరులు ఇందులో భాగమయ్యారు. విశ్వక్ సేన్ ట్విట్టర్ వేదికగా స్పందించగా, తమ హరోంహర సినిమాలో ప్రణీత్ ని తీసుకుని పొరపాటు చేశామని సుధీర్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పడం అరుదైన సంఘటన. భజే వాయు వేగం ప్రమోషన్ల కోసం సదరు ప్రణీత్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తప్పు చేశానని, ఇలాంటి వాళ్ళను క్షమించకూడదని కార్తికేయ ఓపెన్ ఆపాలజీ చెప్పడం కదిలించింది. నిజానికి ఇతని తప్పేమీ లేదు. మంచు లక్ష్మి ఏకంగా నరికి పారేయాలనేంత ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిన్న మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఒక వీడియో రిలీజ్ చేసి అశ్లీల వీడియోలు, సినిమా తారల మీద బూతు కంటెంట్ తయారు చేసిన వాళ్ళు ఎవరైనా రెండు రోజుల్లో అన్ని డిలీట్ చేయాలని లేదంటే కఠిన చర్యలు ఉంటాయనని హెచ్చరించడం మరో ముందడుగు. ఇలా అందరూ కలిసికట్టుగా యువతను ప్రభావితం చేస్తున్న ఆన్ లైన్ మహమ్మారి మీద కలిసికట్టుగా పోరాటం చేయడం వేరొకరిని తప్పు చేయకుండా నిలువరిస్తుంది. నేరం చేసిన వాడికి శిక్ష పడటం ఎంత ముఖ్యమో అలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవడం అంతేకన్నా పెద్ద బాధ్యత. హీరోలు నిర్వర్తిస్తోంది ఇదే.