దర్శక ధీర రాజమౌళి సంతకం తెలుగు సినిమా మీద ఎంత బలంగా ఉందంటే ఎప్పటికీ కలగా మిగిలిపోతుందేమోనని భావించిన ఆస్కార్ ని మన గడ్డను తీసుకొచ్చి అంతులేని సంతోషం నింపేంత. వచ్చింది నాటు నాటు పాటకే అయినప్పటికీ దాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి, జపాన్ లాంటి దేశాల్లో ఆర్ఆర్ఆర్ ఏడాదికి పైగా ఆడేలా చేయడానికి జక్కన్న పడిన కష్టం మామూలుది కాదు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా దానికి రెండు మూడింతలు ఎక్కువ వెనక్కు తీసుకురాగలిగిగే సత్తా ఉన్న వాళ్ళలో దేశవ్యాప్తంగా ఫిలిం మేకర్స్ ఒప్పుకునే పేరు రాజమౌళినే అంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడీయన కీర్తి కిరీటంలో మరో మెచ్చుతునక చేరింది. నెట్ ఫ్లిక్స్ రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ మోడర్న్ మాస్టర్స్ లో తొలి భాగం ఎస్ఎస్ రాజమౌళి మీద రాబోతోంది. ఆగస్ట్ 2 స్ట్రీమింగ్ సిద్దమవుతున్న ఈ సిరీస్ లో బోలెడు విశేషాలు చూపించబోతున్నారు. రాజమౌళి టీవీ ప్రయాణంతో మొదలుపెట్టి స్టూడెంట్ నెంబర్ వన్ తో డెబ్యూ చేయడం దాకా, ఆపై సింహాద్రితో హిట్టు కొట్టి బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి రూపకల్పన చేయడం దాకా ఎన్నో సంగతులు ఇందులో పంచుకోబోతున్నారు. ఎప్పుడూ చూడని ఫోటోలు, వీడియో ఫుటేజ్ ప్రత్యక ఆకర్షణగా ఉంటాయని తెలిసింది.
గతంలో నెట్ ఫ్లిక్స్ రొమాంటిక్స్ పేరుతో యష్ రాజ్ ఫిలింస్ ప్రయాణాన్ని అద్భుతంగా తెరకెక్కించింది. ఇప్పుడీ మోడరన్ మాస్టర్స్ లోనూ అంతకు మించి కంటెంట్ ని రూపొందించారట. రాజమౌళితో పని చేసిన హీరో హీరోయిన్లు, టెక్నీషియన్స్ ఇంటర్వ్యూలు, ఆన్ సెట్ షూటింగ్ లొకేషన్లు, ఆయన ఎందుకింత ఆలస్యంగా సినిమాలు తీస్తారు లాంటి బోలెడు సంగతులు అందులో ఉండబోతున్నాయి. చూచాయగా మహేష్ బాబు 29 ప్రస్తావన కూడా ఉంటుందట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మైంటైన్ చేసే నెట్ ఫ్లిక్స్ రాజమౌళికి ఇంత ప్రాముఖ్యం ఇవ్వడమంటే మాములు విషయమా. అందుకే అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.