ఎందుకో కానీ ఈ మధ్య నటీనటులు తరచుగా వివాదాలు, పోలీసు కేసుల్లో చిక్కుకుని మీడియాలో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఆ మధ్య బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి హేమ ఇష్యూ ఎంత రచ్చ చేసిందో చూశాం.
పక్క రాష్ట్రంలో దర్శన్ మీద అభిమాని హత్య రాద్ధాంతం చాలా దూరం వెళ్ళింది. తాజాగా యువ నటుడు రాజ్ తరుణ్ మీడియాలో హైలైట్ అయ్యాడు. లావణ్య అనే యువతి సహజీవనంలో ఉన్న తనను అతను మోసం చేశాడని, తప్పుడు అభియోగం వల్ల నలభై మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చింది.
రాజ్ తరుణ్ ఎక్కువ సమయం తీసుకోకుండా స్పందించాడు. 2014 నుంచి 2017 దాకా కలిసున్న మాట వాస్తవమేనని, సహజీవనం చేశామని, అయితే లావణ్య డ్రగ్స్ కు అలవాటు పడ్డాక, దాన్ని మానుకోమని చెప్పినందుకు గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టిందని పేర్కొన్నాడు.
ఇల్లు నాదే అయినప్పటికీ మాదకద్రవ్యాల కేసులో లావణ్య ఉండటంతో తానే బయటికి వచ్చానని, ఇప్పుడది స్వంతం చేసుకోవడానికి ఈ డ్రామా మొదలుపెట్టిందని అన్నాడు. తిరగబడరా సామీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా ముంబైలో ఉంటే ఆమెతో ప్రేమలో ఉన్నానని చెప్పడాన్ని కొట్టి పారేశాడు.
నిజానిజాలు విచారణలో బయట పడతాయి కానీ హఠాత్తుగా లావణ్య ఇప్పుడు బయటికి వచ్చి కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తిరగబడరా సామీ టైం నుంచే తమ బంధం బెడిసి కొట్టిందని ఆమె ఆరోపిస్తుండగా చాలా ఏళ్ళ క్రితమే విడిపోయామని రాజ్ తరుణ్ అంటున్నాడు. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని గతంలోనే నిర్ణయించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
అసలే వరస ఫ్లాపులతో ఉన్న ఈ కుర్ర హీరో ఆశలన్నీ తిరగబడరా సామీ మీదే ఉన్నాయి. మాస్ టచ్ ఉన్న కమర్షియల్ సబ్జెక్టు కావడం వల్ల ఖచ్చితంగా బ్రేక్ దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ఈలోగా ఈ ట్విస్టు.
Gulte Telugu Telugu Political and Movie News Updates