కల్కి ఫస్ట్ హీరో అమితాబే-అశ్వినీదత్

‘కల్కి 2898 ఏడీ’ సినిమాను థియేటర్లలో చూసిన వాళ్లు చాలామందికి కలిగిన సందేహం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరో ప్రభాసా, అమితాబ్ బచ్చనా అని. ఎందుకంటే సినిమాలో అమితాబ్ పోషించిన అశ్వథ్థామ పాత్ర మంచి కోసం పోరాడితే.. ప్రభాస్ పాత్ర చెడు వైపు నిలబడుతుంది. ఐతే హీరో పాత్రలు ముందు నెగెటివ్ షేడ్స్‌తో ఉండి తర్వాత పాజిటివ్‌గా మారడం మామూలే.

‘కల్కి’లో కూడా ప్రభాస్ పాత్ర ఇలాగే మారేలా కనిపించింది కానీ.. ఫస్ట్ పార్ట్ వరకు అయితే నెగెటివ్ షేడ్స్‌తోనే కనిపించింది. దీంతో ఈ సినిమాకు అసలైన హీరో అమితాబే అన్న అభిప్రాయం కలిగింది. ఇప్పుడు నిర్మాత అశ్వినీదత్ సైతం ఇదే మాట అనడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘కల్కి’ సినిమాకు ఫస్ట్ హీరో అమితాబే అన్నారు. అంతే కాక ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం ఎవరు అని అడిగినా.. అమితాబ్ అనే చెప్పారు దత్.

అశ్వినీదత్ ఇలా అన్నారని ప్రభాస్ ఫ్యాన్సేమీ ఫీలయిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అమితాబ్ గురించి ప్రభాస్ స్వయంగా అన్న మాటలను కూడా దత్ ఈ ఇంటర్వ్యూలో ఉటంకించారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో అమితాబే అని ప్రభాసే అన్నాడని.. అతడి అభిప్రాయాన్ని తామంతా గౌరవించాలని అనుకున్నామని అశ్వినీదత్ అన్నారు. అమితాబ్‌ను అలా గౌరవిస్తేనే తమకు గౌరవం దక్కుతుందని ప్రభాస్ వ్యాఖ్యానించినట్లు కూడా దత్ వెల్లడించారు.

అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో నటించడం పట్ల ప్రభాస్ ఎంతో ఎగ్జైట్ అయ్యాడని.. కల నెరవేరినట్లుగా భావించాడని దత్ తెలిపారు. ఇదిలా ఉండగా ‘కల్కి-2’కు సంబంధించి సగానికి పైనే పూర్తయిందని.. ఆ చిత్రం 2025 వేసవిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అశ్వినీదత్ చూచాయిగా చెప్పారు.